-జగన్ పై మంత్రి సవిత ఫైర్
-రాష్ట్రంపై రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం
-మరో రూ.లక్షా 40 వేల కోట్ల బకాయిలు
-7 నెలల్లో రూ.22 వేల కోట్ల బకాయిలు చెల్లించిన సీఎం చంద్రబాబు : మంత్రి సవిత
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఒక్కసారి ఛాన్స్ అంటూ బీద అరుపులకు చలించి ఆంధప్రదేశ్ ప్రజలు అవకాశమిస్తే… రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో ముంచేసి ఆర్థిక వ్యవస్థను దివాళా తీయించారని జగన్ రెడ్డిపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అయిదేళ్లలో కాలంలో జగన్ ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు అప్పులు చేయగా, లక్షా 40 వేల కోట్ల రూపాయల మేర బకాయిలు పెట్టిందని, ఇప్పుడవి తమ ప్రభుత్వానికి గుది బండగా మారితే, ప్రజలకు శాపంగా పరిణమించాయని విరుచుకుపడ్డారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడు నెలల కాలంలో జగన్ ప్రభుత్వం బకాయి పెట్టిన ఆరోగ్యశ్రీ, ధాన్యం, ఫీజు రియింబర్స్ మెంట్ కు రూ.22 వేల కోట్లను సీఎం చంద్రబాబునాయుడు చెల్లించారన్నారు. ఈ మేరకు బుధవారం మంత్రి సవిత ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక అసమర్థుడు పాలన వల్ల రాజ్యం ఎంతమేర నష్టానికి గురవుతుందో ఏపీని చూస్తే ఇట్టే అర్థమవుతుందన్నారు. 5 ఏళ్ల జగన్ పాలన వల్ల రాష్ట్రాభివృద్ధి 20 ఏళ్లు వెనక్కి వెళ్లడమే కాకుండా, అన్ని వ్యవస్థలూ నిర్వీర్యమైపోయాయన్నారు. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దివాళా తీసిందన్నారు. తన అసమర్థత, తుగ్లక్ నిర్ణయాలతో పాటు జల్సాలు, ఆడంబరాలు, ప్రచార యావ కోసం లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మంత్రి సవిత మండిపడ్డారు. 5 ఏళ్ల కాలంలో జగన్ రూ.10 లక్షల కోట్లు అప్పులు చేస్తే..వాటి అసలు, వడ్డీ తీర్చడానికి ఏడాదికి రూ.71 వేల కోట్లు అవసరమవుతోందని ఆవేదన వ్యక్తంచేశారు.
రూ.1.40 లక్షల కోట్ల బకాయిలు
అయిదేళ్ల పాలనలో జగన్ ప్రభుత్వం పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలకు రూ.1.40 లక్షల కోట్ల బకాయి పెట్టారని మంత్రి సవిత వెల్లడించారు. ఫీజు రియంబర్స్ మెంట్ కింద రూ.3,282 కోట్లు, చిక్కిలు, కోడి గుడ్లకు రూ.256 కోట్లు, వసతి దీవెనకు రూ.989 కోట్లు మేర జగన్ బకాయి పెట్టారన్నారు. ఆరోగ్యశ్రీకి రూ.1800 కోట్లు, ధాన్యం కొనుగోలుకు రూ.1600 కోట్లు, ఇరిగేషన్ కాంట్రాక్టర్లకు రూ.19 వేల కోట్లు, గృహ నిర్మాణానికి రూ.7,800 కోట్లు, ఉపాధి హామీకి రూ.2,100 కోట్లతో పాటు ఉద్యోగులకు రూ.20 వేల కోట్ల మేర బకాయిలు పెట్టారన్నారు.
రూ.19,871 కోట్ల ప్రజాధనం దుబారా
అయిదేళ్ల పాలనలో జగన్ రెడ్డి తన జల్సాలకు, విలాసాలకు, ప్రచార యావకు రూ.19,871 కోట్లు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని మంత్రి సవిత మండిపడ్డారు. సచివాలయాలకు వైసీపీ రంగులు వేయడానికి రూ.3 వేల కోట్లు ఖర్చు చేశారని వెల్లడించారు. సర్వే రాళ్లపై తన బొమ్మ కోసం రూ.700 ఖర్చు చేసిన ప్రబుద్ధుడు జగన్ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. విశాఖలోని రుషికొండపై విలాసంతమైన భవన నిర్మాణానికి రూ.600 కోట్లు ఖర్చు చేశారన్నారు. ప్రకటనల పేరుతో తన సొంత పత్రిక సాక్షికి రూ.500 కోట్లు దోచిపెట్టారన్నారు. తాడేపల్లిలోని తన ప్యాలెస్ వద్ద 986 మంది పోలీసు సిబ్బందిని సెక్యూరిటీ పెట్టుకుని రూ.వెయ్యి కోట్లు వెచ్చించారన్నారు. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ఇనుప ఫెన్సింగ్ కోసం రూ.12.85 కోట్లు, ప్రహరీ నిర్మాణానికి రూ.10 కోట్లు, ప్యాలెస్ ముందు రోడ్డు నిర్మాణానికి రూ.5 కోట్లు, పట్టాదారు పాస్ పుస్తకాలపై తన ఫొటో వేయడానికి రూ.13 కోట్లు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిన ఘనుడు జగన్ రెడ్డి అని మంత్రి సవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
రూ.8 లక్షల కోట్ల మేర జగన్ లూటీ
కేవలం 5 ఏళ్ల పాలనా కాలంలో ప్రజలిచ్చిన అధికారాన్ని అడ్డంగా పెట్టుకుని రూ.8 లక్షల కోట్ల జగన్ రెడ్డి ప్రజాధనాన్ని లూటీ చేశారని మంత్రి సవిత ఆరోపించారు. భూ కేటాయింపులు, గనుల తవ్వకాలు, సోలార్ కు అనుమతులివ్వడంలో…ఇలా ప్రతీ దాంట్లోనూ చేతివాటం చూపుతూ లక్షల కోట్లు కొల్లగొట్టారని మండిపడ్డారు. టీడీఆర్ బాండ్లు, స్మార్ట్ మీటర్ల కొనుగోళ్లు, రేషన్ బియ్యం పంపిణీలోనూ చేతివాటం చూపారన్నారు. కేవలం జే ట్యాక్స్ పేరుతో వేల కోట్లు దోచేశారన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు, ఇళ్ల స్థలాల కొనుగోలు, మద్యం అమ్మకాలు, 22(ఏ), అసైన్డ్ భూముల కుంభకోణాల పేరుతో లక్షల కోట్లు కూడబెట్టుకున్నారని మంత్రి సవిత ఆరోపించారు.
రూ.22 వేల కోట్ల బకాయిల చెల్లింపు
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో అధికారం చేపట్టిన సీఎం చంద్రబాబుపై ఏపీ అప్పులతో బకాయిలు గుదిబండగా మారాయని మంత్రి సవిత ఆవేదన వ్యక్తంచేశారు. జగన్ అసమర్థత కారణంగా ఒకవైపు బకాయిలు చెల్లిస్తూనే, అసలు, వడ్డీ కూడా తమ ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. గడిచిన ఏడు నెలల్లో రూ.22 వేల కోట్లను ఫీజు రియింబర్స్ మెంట్, ధాన్యం కొనుగోలు, ఆరోగ్య శ్రీ బకాయిలను సీఎం చంద్రబాబునాయుడు చెల్లించారన్నారు. జగన్ చేసిన నిర్వాకంతో రాష్ట్రానికి అప్పులు కూడా పుట్టని పరిస్థితి నెలకొందన్నారు. అప్పులు ఊబిలో కూరుకుపోయిన ఏపీని అభివృద్ధిపథం వైపు నడిపించడానికి సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ రేయింబవళ్లు కృషి చేస్తున్నారన్నారు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఒక వైపు అభివృద్ధి పనులు చేపడుతూనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓర్వలేక జగన్ సహా వైసీపీ నేతలు తప్పుడు కూతలు కూస్తూ, సొంత పత్రికలో విషపు రాతలు రాస్తూ రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రజలు విజ్ఞులని, జగన్ అవాకులు చవాకులు పట్టించుకోరని మంత్రి సవిత అభిప్రాయపడ్డారు.