– జంతు హింస నివారణ చట్టంపై అవగాహన ముఖ్యం
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జంతు సంక్షేమం అనేది మనందరి బాధ్యత అని.. జిల్లాలో జంతు సంరక్షణలో స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు. జంతు సంక్షేమ పక్షోత్సవాలు (జనవరి 14-30) సందర్భంగా జిల్లా పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులకు గ్రామ, మండల స్థాయిలో క్విజ్, వక్తృత్వ, వ్యాస రచన అంశాల్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలకు బుధవారం జిల్లాస్థాయిలో పోటీలు నిర్వహించగా, విజేతలకు కలెక్టర్ లక్ష్మీశ కలెక్టరేట్‌లో సర్టిఫికేట్లు, బహుమతులు అందజేసి, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్టాడుతూ జంతు హింస నివారణ చట్టంపై ప్రతిఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని, జంతు సంరక్షణ ప్రాధాన్యతను గుర్తెరిగి మసలుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా పశు సంవర్థక అధికారి డా. ఎం.హనుమంతరావు, డిప్యూటీ డైరెక్టర్ డా. మోసెస్ వెస్లీ, ఏడీ డా. వి.కృష్ణమూర్తి, సమగ్రశిక్ష ఏఎంవో ఎస్.అశోక్ బాబు, సెంట్రల్ ఎంఈవో విజయరామారావు తదితరులు పాల్గొన్నారు.