-విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రాష్ట్ర సహకార సంఘాల సవరణ చట్టాన్ని రద్దు చేయాలని బుధవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన రాజకీయపక్షాల రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. సుప్రీం కోర్టు తీర్పులను అతిక్రమిస్తూ సహకార బ్యాంకులు, సహకార సంస్థలలోని వాటాలు సభ్యులు కానీ పెట్టుబడిదారులకు అమ్మాలని ఈ చట్టాలలోని సెక్షన్లు నిర్దేసిస్తున్నాయని సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. సమావేశానికి అధ్యక్షత వహించిన హైదరాబాదుకు చెందిన ‘సహకార ధర్మపీఠం’ వ్యవస్థాపకులు సంభారపు భూమయ్య మాట్లాడుతూ సహకార చట్టంలో పొందుపరిచిన సహకార సూత్రాలకు భిన్నంగా ఈ చట్టాలలోని సెక్షన్లు ఉన్నాయన్నారు. ఈ చట్టం అమలైతే సహకార వ్యవస్థ ఉనికికే ప్రమాదమని, ఈ రంగం స్వయంప్రతిపత్తి కోల్పోతుందని పేర్కొన్నారు. సహకార చట్టాల ప్రకారం వాటాలు బహిరంగ మార్కెట్లో అమ్మడం, బదలాయించడం నిషేధమని ఆయన చెప్పారు. సన్న, చిన్నకారు రైతులు, చేతివృత్తిదారులు, బలహీనులకు సాధికారత కల్పిస్తున్న సహకార విధానాన్ని రక్షించేందుకు సవరించిన చట్టాలలోని సెక్షన్లను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరుతూ రాష్ట్ర శాసన సభలో తీర్మానం చేయాలని భూమయ్య కోరారు. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాద్రిశ్వరరావు మాట్లాడుతూ సహకార చట్టం రాష్ట్ర పరిధిలోని అంశం అని, కేంద్ర ప్రభుత్వానికి జోక్యం చేసుకునే హక్కు లేదని అన్నారు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలను సంప్రదించకుండా వారి ఆమోదం లేకుండా కేంద్రం ఏకపక్షంగా చట్టాలను తీసుకువస్తున్నదని ఆయన విమర్శించారు. పార్లమెంటు స్టాండింగ్ కమిటీలో ప్రతిపక్ష సూచనలను కూడా ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు. సహకార వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వాల అధికార పరిధిలోనే ఉన్నందున ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని, ఈ రంగాన్ని కాపాడుకోవాలని ఆయన కోరారు. సహకార వ్యవస్థ పరిరక్షణకు సహకార ధర్మపీఠం భూమయ్య చేపట్టిన ఉద్యమం ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సిన అంశమని వడ్డే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. పుష్పరాజ్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు కె.వి. వి.ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం నాయకులు పి. రమణయ్య, సహకారభూమి జర్నల్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ దాసరి కేశవులు తదితరులు పాల్గొన్నారు.