గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
వాహనదారులకు ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ మీ కుటుంబానికి అనందం ఇచ్చే గ్రీన్ సిగ్నల్ అని, శిరస్త్రాణం (హెల్మేట్) ధరించటం ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళె కీరీటం అని, చేతిలో ఉండే డ్రైవింగ్ చక్రం మీ జీవితాన్ని కాపాడే సుదర్శన చక్రం అని కేంద్ర గ్రామీణాభివృధ్ది, కమ్యూనికేషన్ శాఖ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
బుధవారం కలెక్టరేట్ లోని ఎస్ఆర్ శంకరన్ హాలులో జరిగిన జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు -2025 కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృధ్ది, కమ్యూనికేషన్ శాఖ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, శాసనసభ్యులు గళ్లా మాధవి, మహ్మద్ నసీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులు, తెనాలి శ్రావణ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులతో కలసి పాల్గోన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేంద్ర గ్రామీణాభివృధ్ది, కమ్యూనికేషన్ శాఖ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ హెల్మేట్ ధరించటం వలన జుట్టు రాలిపోతుందన్న అపోహ మాత్రమే అన్నారు. ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణం (హెల్మేట్ ) ధరించటం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయని, ప్రమాద సమయంలో సురక్షితంగా ఉండటంతో పాటు దుమ్ముదూళి నుంచి రక్షణ పొందవచ్చన్నారు. జన్యుపరమైన సమస్యలు, కెమికల్స్ వలన మాత్రమే జుట్టు రాలిపోతుందన్నారు. ఎయిర్ ఫ్లో హెల్మేట్ లు వినియోగించటం, తరుచు హెల్మేట్ లు శుభ్రం చేసుకోవటం వలన జుట్టుకు ఎటువంటి హాని జరగదన్నారు. వాహన ప్రమాదాలు 400 జరిగితే 250 మందికి పైగా చనిపోతున్నారని, వాహనాల్లో సీటు బెల్ట్ పెట్టుకోవటం వలన ప్రమాదాలు జరిగినప్పుడు 90 శాతం వరకు రక్షణ ఉంటుందన్నారు. అతివేగంగా వాహనాలు నడపటం, వాహనాలు నడిపేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడకపోతే ఐదు నిమిషాల సమయం మాత్రమే వృధా అవుతుందని, ప్రమాదాలు జరిగి ఆస్పత్రిలో చేరితే నెలలు తరబడి హాస్పిటల్స్ లో కదలకుండా ఉండాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. యువత వాహనాలు అతివేగంగా నడపటం వలన ఫ్యాషన్ కన్నా ప్రమాదాలు ఎక్కువని, రన్నింగ్ రేస్ లో పాల్గొని వారి సామర్ధ్యాలు నిరుపించుకోవాలన్నారు. దేశానికి యువతే భావి భారత పౌరులని రహదారులు భద్రత నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ సురక్షితంగా ఉండాలన్నారు.
జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ మాట్లాడుతూ వాహనదారుల స్వీయ రక్షణ కోసమే రహధారి భధ్రత నిబందనలు ఖచ్చితంగా పాటించాలన్నారు. రహదారి భద్రత నిబంధనలపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం జనవరి 16వ తేదినుంచి ఫిబ్రవరి 15 వరకు జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను నిర్వహిస్తుందన్నారు. యువత చాలా మంది లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్నారని, మైనర్లు సైతం వాహనాలు నడుపుతున్నారని, హెల్మేట్ లేకుండానే ద్విచక్ర వాహనాలు నడుపుతున్నారన్నారు. వాహనదారులు ముఖ్యంగా యువత రహదారి భద్రత నిబంధనలు ద్విచక్ర వాహనదారులు హెల్మేట్ ధరించటం, కార్లలోప్రయాణించేవారు సీటు బెల్ట్ ధరించాలన్నారు. మితీమీరిన వేగంతో ప్రయాణించరాదని, డ్రంక్ అండ్ డ్రవ్ చేయరాదని, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపరాదని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు.
జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ రహదారి భద్రత నిబంధనలు పాటించకపోవటం వలన ద్విచక్ర వాహనదారులు ఎక్కువుగా ప్రమాదాలు బారిన పడుతున్నారన్నారు. స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్ అన్నారు. రహదారి ప్రమాదంలో చనిపోవటం హత్యతో సమానం అని, ప్రమాదంలో ఆకస్మాత్తుగా కుటుంబ సభ్యులు ఆకస్మికంగా చనిపోవటం వలన వారి కుటుంబాల పరిస్థితి తారుమారు అవుతాయన్నారు. జిల్లాలో గత సంవత్సర కాలంగా 607 రహదారి ప్రమాదాలు జరిగాయన్నారు. జాతీయ రహదారి సర్వీస్ రహదారి పైనే ద్విచక్ర వాహనాలు ఆటోలు ప్రయాణించాలన్నారు. ద్విచక్ర వాహనం పై హెల్మేట్ లేకుండా ప్రయాణించితే గౌరవ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రూ.1000 అపరాధ రుసుంతో పాటు, మూడు నెలలు లైసెన్స్ రద్దు చేయటం జరుగుతుందన్నారు. ఈ నిబందనపై గత నెలరోజులుగా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించటం జరిగిందని, ఫిబ్రవరి నెల నుంచి నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ రహదారి భద్రత నిబంధనలు, ట్రాఫిక్ రూల్స్ ను ఖచ్చితంగా పాటించటం వలన ప్రమాదాల నివారణతో పాటు, ట్రాఫిక్ రద్దీని నివారించటం సాధ్యం అవుతుందన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిని సిటిజన్స్ ఫోటో తీసే ఫిర్యాదు చేసేందుకు వీలుగా ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ప్రత్యేక యాప్ ను నగర పాలక సంస్థ పరిధిలో ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
శాసనసభ్యులు గళ్లా మాధవి మాట్లాడుతూ రహదారి భధ్రత ప్రాధమిక నిబంధనలు పాటించటం వలన వాహనదారులు సురక్షితంగా ప్రయాణిస్తూ అమూల్యమైన ప్రాణాలు కాపాడుకోవచ్చన్నారు. నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడపటం బాధ్యతరాహిత్యం అన్నారు. రహదారుల నిబంధనల అవగాహన లోపంతో స్వేచ్చ కోసం వినియోగించే వాహనాలు ప్రమాదాలకు గురి చేసి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దన్నారు.
శాసనసభ్యులు మహ్మద్ నసీర్ అహ్మద్ మాట్లాడుతూ విద్యార్ధి దశ నుంచి రహదారి భద్రత నిబంధనలు, ట్రాఫిక్ రూల్స్ పై విద్యాసంస్ధల్లో అవగాహన కల్పించాలన్నారు. వాహనదారులు ఖచ్చితంగా భద్రత నిబంధనలు పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై రియల్ టైంలో అపరాధ రుసుం విధించే విధానంను అమలు చేయాలన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మేట్ ధరించటం వలన ప్రమాదాలు జరిగితే ప్రాణ హాని తప్పుతుందన్నారు.
శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ రహదారి నిబంధనలు పాటించకుండా అనాలోచితంగా వాహనాలు నడపటం వలనే ప్రమాదాలు జరిగి అమూల్యమైన ప్రాణాలు కోల్పోవటం దురదృష్టకరం అన్నారు. వాహనాలు నడిపేటప్పుడు కుటుంబసభ్యులను దృష్టిలో ఉంచుకుంటే ఏకగ్రాతతో నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడుపుతారన్నారు. రహదారి ప్రమాదాలు జరిగితే వారికే కాకుండా అదే సమయంలో రహదారిపై ప్రయాణిస్తున్న వారు కూడ ప్రమాదాలకు గురి అవుతారన్నారు. ప్రమాదాల్లో మరణిస్తే వారి కుటుంబసభ్యుల బాధలు తీర్చలేనివి అన్నారు.
శాసన సభ్యులు తెనాలి శ్రావణ కుమార్ మాట్లాడుతూ రహదారి భద్రత నిబంధనలు పాటించకుండా సౌకర్యం కోసం వినియోగించే వాహనాలను ప్రాణాలు తీసే పరిస్థితికి తీసుకురావద్దని, యువత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. సమాజంలో వాహనదారులు వ్యక్తిగత క్రమశిక్షణతో భద్రత నిబందనలు పాటించాలన్నా ఆలోచన ధోరణి ఉంటేనే రహదారులపై ప్రమాదాల రహితంగా సురక్షిత ప్రయాణం సాధ్యం అవుతుందన్నారు. రహదారి ప్రమాదాల్లో వ్యక్తి మరణిస్తే వారి కుటుంబం పరిస్థితి తారు మారు అవుతుందన్నారు. వాహనదారుల ప్రాణ రక్షణ కే భద్రత నిబంధనలు రూపొందించారని వాటిని ఖచ్చితంగా పాటించాలన్నారు.
రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన కృఫ్ణ మాట్లాడుతూ వాహనాన్ని వెపన్ అపరేట్ చేస్తున్న విధంగా జాగ్రత్తగా భద్రత నిబంధలు పాటిస్తూ నడిపితేనే సురక్షితంగా ప్రయాణం సాధ్యం అవుతుందన్నారు. భద్రత నిబంధనలు, ట్రాఫిక్ రూల్స్ యువత పాటించటం వలన ప్రమాదాలు తగ్గుతాయన్నారు.
సమావేశంలో యువత, విధ్యార్ధులతో రహదారి భద్రత నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.
సమావేశం అనంతరం రహదారి భద్రత నిబంధనలపై ఏర్పాటు చేసిన ద్విచక్ర వాహనాల హెల్మేట్ ర్యాలీని కేంద్ర గ్రామీణాభివృధ్ది, కమ్యూనికేషన్ శాఖ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, శాసనసభ్యులు గళ్లా మాధవి, మహ్మద్ నసీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులు, తెనాలి శ్రావణ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులతో కలసి జెండా ఊపి ప్రారంభించి, కలెక్టరేట్ నుంచి ప్రారంభమైన ర్యాలీలో శాసనసభ్యులు బూర్ల సీతారామాంజనేయులు ద్విచక్రవాహనం నడపగా కేంద్ర మంత్రి డా. పెమ్మసాన చంద్రశేఖర్ , శాసనసభ్యులు నసీర్ అహ్మద్, గళ్లా మాధవి తో కలసి పాల్గొన్నారు.
కార్యక్రమంలో లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు, ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి, జిల్లా ఉప రవాణ కమిషనర్ సీతారామిరెడ్డి, గుంటూరు ఆర్టీవో సత్యన్నారయణ ప్రసాద్, తెనాలి ఆర్టీవో శ్రీహరి , గుంటూరు, మంగళగిరి, తెనాలి మోటర్ తనిఖీ అధికారులు, సహాయ మోటరు తనిఖీ అధికారులు మరియు సిబ్బంది, వాహనదారులు, యువత, విధ్యార్ధులు పాల్గొన్నారు.
