గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా పబ్లిక్ ట్రాన్స్ పోర్టు వాహనాలు (సిటిబస్సులు) ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులకు సూచించారు.
బుధవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో కేంద్ర గ్రామీణాభివృధ్ది, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, శాసనసభ్యులు మహ్మద్ నజీర్ అహ్మద్, గళ్లా మాధవి, బూర్ల రామాంజనేయులతో కలసి నగరంలో పబ్లిక్ ట్రాన్స్ పోర్టు నిర్వహణ, శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ సమయంలో ట్రాఫిక్ మళ్ళింపు మార్గాలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ నగర విస్తరణకు అనుకూలంగా ప్రజల రవాణాను పెంచే అవకాశాలను పరిశీలించాలన్నారు. సిటి బస్సు స్టాపుల ఏర్పాటు, స్టాపింగ్ సమయం రెగ్యూలైజేషన్ కు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రైవేటు సిటి బస్సుల సర్వీసులను పెరిగిన నగర పరిధికి అనుగుణంగా సర్వీసులు పెంచేందుకు రవాణాశాఖ, ఆర్టీసీ ప్రతిపాదనలు సిద్ధం చేసి రెండు వారాల్లో అనుమతుల మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. నూతన రూట్లపై అనుమతుల కోసం ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలన్నారు. నూతన రూట్లలో ఈవీ బస్సులను మాత్రమే నడపాలని ప్రవేటు సిటి బస్సు ఆపరేటర్స్ కు సూచించారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం సమయంలో ట్రాఫిక్ మళ్ళించే రహదారుల మరమ్మత్తులు, అభివృద్ది , విస్తరణ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు.
జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న సిటిబస్సు రూట్స్ విస్తరణ అనుమతులు రెండువారాల్లో జిల్లా రవాణా కమిటీ సమావేశం నిర్వహించి పరిష్కరిస్తామని, నూతన రూట్ల అనుమతుల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపుతామన్నారు. ప్రవేటు సిటి బస్సు ఆపరేటర్స్ ఈవీ బస్సుల కొనుగోలుకు ఉన్న అవకాశాలపై బ్యాంకర్ లు, ఈవీ బస్సు కంపెనీలు, సీటీ బస్సు ఆపరేటర్స్ తో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు.
సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి, జిల్లా ఉప రవాణా కమిషనర్ సీతారామిరెడి, ఆర్టీసీ ఆర్ ఎం కృష్ణకాంత్, ట్రాఫిక్ డీఎస్పీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
డొంకరోడ్డు మూడు వంతెనల వద్ద ఆర్ యూ బీ పనుల పరిశీలన
సమావేశం అనంతరం కేంద్ర గ్రామీణాభివృధ్ది, కమ్యూనికేషన్ శాఖ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, శాసనసభ్యులు మహ్మద్ నజీర్ అహ్మద్, గళ్లా మాధవి, బూర్ల రామాంజనేయులతో కలసి డొంకరోడ్డు మూడు వంతెనల వద్ద జరుగుతున్న రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులను పరిశీలించారు. ఆర్ యూ బీ పనులు ప్రారంభించిన తరువాత నగరపాలక సంస్థ మంచినీటి పైపులైను లీకులు రావటంతో పనుల జాప్యం జరుగుతుందని రైల్వే అధికారులు కేంద్ర మంత్రికి తెలిపారు. ప్రీకాస్ట్ బ్లాక్స్ తో ఆర్ యూ బీ నిర్మాణ పని ప్రారంభమైమదని ఫిబ్రవరి 15వ తేది నాటికి రైల్వే పనులు పూర్తి అవుతాయన్నారు. ఈ సంధర్భంగా కేంద్ర మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ సుమారు 25 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పైపులైన్ల కారణంగా పనులు ఆలస్యం అవుతున్నాయని తెలిసింది అన్నారు. ఆయా సమస్యలను పరిష్కరిస్తూ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రైల్వే అధికారులకు ఆదేశించామన్నారు. రైల్వే వంతెన పనులు ఎప్పటికీ పూర్తవుతాయన్నది ప్రజలకు తెలిసేలా నోటీస్ బోర్డులు ఏర్పాటు చేయమని అధికారులకు సూచించారు. ఈ వంతెనలు త్వరగా పూర్తి చేయడం వల్ల నగరంలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించిన వాళ్ళం అవుతామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో రైల్వే ఏడీఆర్ఎం సైమన్ , సీపీఎం మనోహర రెడ్డి, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
