Breaking News

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మెరుగైన వైద్య సేవలు అందించాలి… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో (పి హెచ్ సి) మెరుగైన వైద్య సేవలు అందించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వైద్య అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులు, పీ హెచ్ సీ లలో వైద్య సేవలు, మౌలిక వసతుల కల్పన, సమస్యలపై బుధవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్ లోని తన ఛాంబర్లో వైద్య ఆరోగ్య, రహదారులు భవనాలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైద్యాధికారులు జిల్లాలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించి మెరుగైన వైద్య సేవలు, మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలన్నారు. పీహెచ్సీలలో అధిక మొత్తంలో డెలివరీలు జరిగేలా చూడాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో బయోమెడికల్ వ్యర్థాల సేకరణకు రంగు కవర్లు కలిగిన చెత్త బుట్టల ఏర్పాటుపై ఆయన వైద్య అధికారులను ఆరా తీశారు. క్రమం తప్పకుండా వాటిని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

బంటుమిల్లి పీహెచ్సీ భవనం పాడైపోయి పైకప్పు పెచ్చులూడుతోందని, ఉన్న భవనం సైతం ఇరుకుగా ఉందని, దానిని ఆధునీకరించి విస్తరించాల్సిన అవసరం ఉందని డిఎంహెచ్వో కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, అంచనాలు తయారుచేసి నివేదిక సమర్పించాలన్నారు. పామర్రు నియోజకవర్గంలోని గరికపర్రులో వైద్య సేవల నిమిత్తం ఒక దాత (ఎన్నారై) భవనాన్ని నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చారని, దానిని సద్వినియోగం చేసుకునేలా సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి ప్రహరీ గోడ (కాంపౌండ్ వాల్), సమావేశ మందిరం నిర్మించాల్సిన అవసరం ఉందని డి ఎం అండ్ హెచ్ ఓ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అందుబాటులో గల నిధులను ఉపయోగించుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.

అర్హత గల వైద్యులకు నిపుణులైన గైనకాలజిస్టులతో డెలివరీలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ డెలివరీలపై ఇప్పటికే శిక్షణ పొందిన పలువురి వైద్యుల అభిప్రాయాలను ఫోన్లో మాట్లాడి తెలుసుకున్నారు.

ఈ సమావేశంలో డీఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ శర్మిష్ఠ, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నరేష్, ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ ప్రేమ్ చంద్, డీసీఓ డాక్టర్ సతీష్, ప్రోగ్రాం ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సాంస్కతిక వారసత్వాలకు చిహ్నంగా ‘లేపాక్షి’

-సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపట్టేలా నిర్మాణాలు -రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని షో రూమ్ ల్లోనూ మరమ్మతులు -ఎస్పీఏవీతో ఏపీహెచ్డీసీ ఒప్పందం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *