గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి కృష్ణ – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికకు సంబంధించి జనవరి 29 వ తేది నుండే ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చినందున జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదేశాల మేరకు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేస్తున్నామని, రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు సహకరించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఎన్నికల నియామావళి అమలులో భాగంగా వార్డ్ సచివాలయాల వారీగా వివిధ రాజకీయ పార్టీల బ్యానర్లు, పోస్టర్లు, హోర్డింగ్లను పట్టణ ప్రణాళిక విభాగ ఆధ్వర్యంలోని దళం బృందాలు తొలగిస్తున్నాయన్నారు. అలాగే రాజకీయ పార్టీల నాయకుల విగ్రహాలను ముసుగులతో కప్పివేయడం జరుగుతుందని పేర్కొన్నారు. వార్డ్ సచివాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో రాజకీయ నాయకుల ఫొటోలు తొలగించాలని, నోడల్ అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. నగరపాలక సంస్థ తరుపున నూతన అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయకూడదని అధికారులు తగు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. సచివాలయ కార్యదర్శులు తమ సచివాలయం పరిధిలో నూరు శాతం ఎన్నికల నియామావళి పక్కాగా అమలు జరిగేలా సంయుక్తంగా కృషి చేయాలని, నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలో ఎన్నికల నియమావళి అమలుకు పట్టణ ప్రణాళిక అధికారులు భాధ్యత తీసుకోవాలని, విధుల్లో ఎక్కడా నిర్లిప్త వైఖరి ఉండడానికి వీలు లేదని స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News