-ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సమావేశం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలను నిష్పక్షపాతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్ లో ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. ఈ నెల ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ జారీ అవుతుందని, ఫిబ్రవరి 10 వరకు అభ్యర్థులు నామినేషన్లు వేయొచ్చన్నారు. ఫిబ్రవరి 11న నామినేషన్ల పరిశీలన ఉంటుందని, ఫిబ్రవరి 13 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అని తెలిపారు. ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని వివరించారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉంటుందని, మార్చి 8వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందన్నారు. అప్పటివరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమల్లో ఉంటుందని, ఈ నియమావళిని రాజకీయ పార్టీలు తు.చ. తప్పకుండా పాటించాలన్నారు.
ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ భారత ఎన్నికల సంఘం – ఎంసీసీ నియమ నిబంధనలను క్షుణ్నంగా చదివి వివరించారు. పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి జిల్లాలో 35,343 మంది పురుషులు, 27,796 మంది మహిళలు, 4గురు టీజీ ఓటర్లు కలిపి మొత్తం 63,143 మంది ఓటర్లు ఉన్నట్లు వివరించారు. ఆన్‌లైన్లో వచ్చే ఫారం-18లను క్షుణ్నంగా పరిశీలించి, పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు జిల్లాలో ముసాయిదా జాబితా ప్రకారం 76 పోలింగ్ స్టేషన్లు కలిగి ఉండగా, వాటిలో గుడివాడ రెవిన్యూ డివిజన్ పరిధిలో 23 పోలింగ్ కేంద్రాలు, మచిలీపట్నం డివిజన్ పరిధిలో 28, ఉయ్యూరు డివిజన్ పరిధిలో 25 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వివరించారు. వీటికి అదనంగా సహాయ పోలింగ్ కేంద్రం కోసం ఒకటి ప్రతిపాదించినట్లు ఆయన తెలిపారు. ఉన్న పోలింగ్ కేంద్రాలపై తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ సందర్భంగా కలెక్టర్ కు తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖర రావు, కె ఆర్ ఆర్ సి డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, గుడివాడ, మచిలీపట్నం రెవిన్యూ డివిజన్ల అధికారులు జి బాలసుబ్రమణ్యం, కే స్వాతి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పీవీ గజేంద్రరావు (బిజెపి), షేక్ సిలార్ దాదా (వైఎస్ఆర్ సిపి), కొడాలి శర్మ (సిపిఐ(ఎం), అబ్దుల్ మతీన్( ఐ ఎన్ సి), ఎస్. బాలాజీ (బీఎస్పీపి) తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News