Breaking News

ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో 100 శాతం ఉత్తీర్ణ‌త సాధించాల్సిందే

– ఏ ఒక్క విద్యార్థీ ఫెయిల్ కావ‌డానికి వీల్లేదు
– ప్ర‌తి విద్యార్థిపైనా ప్ర‌త్యేకంగా దృష్టిసారించాలి
– సాంఘిక సంక్షేమ వసతి గృహాల అధికారులతో క‌లెక్ట‌ర్ డా. జి.లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో సాంఘిక సంక్షేమ వ‌స‌తి గృహాల్లో ఉండి చ‌దువుకుంటున్న ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థులు ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల్లో 100 శాతం ఉత్తీర్ణ‌త సాధించేలా కృషిచేయాల‌ని, ఏ ఒక్క విద్యార్థీ ఫెయిల్ కాకుండా ప్ర‌తిఒక్క‌రిపైనా ప్ర‌త్యేకంగా దృష్టిసారించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ సహాయ సాంఘిక సంక్షేమ, వ‌స‌తి గృహ సంక్షేమ అధికారుల‌ను ఆదేశించారు.
సోమ‌వారం కలెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వ‌ర్యంలో సహాయ సాంఘిక సంక్షేమ, వ‌స‌తి గృహ సంక్షేమ అధికారులు, ట్యూట‌ర్ల‌తో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ స‌మావేశం నిర్వ‌హించారు. మార్చి 17 నుంచి ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ప్ర‌స్తుతం విద్యార్థుల అక‌డ‌మిక్ సామ‌ర్థ్యం, ప‌రీక్ష‌ల్లో శ‌త శాతం ఉత్తీర్ణ‌త‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌లు త‌దిత‌రాల‌పై క‌లెక్ట‌ర్ మార్గ‌నిర్దేశ‌నం చేశారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ జిల్లాలో 2023-24 విద్యా సంవ‌త్స‌రంలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో సాంఘిక సంక్షేమ వ‌స‌తి గృహ విద్యార్థుల ఉత్తీర్ణ‌త శాతం 95.2 శాతంగా న‌మోదైంద‌ని, ఈ ఏడాది 100 శాతం న‌మోదుకు స‌మ‌ష్టిగా కృషిచేయాల‌ని ఆదేశించారు. స‌బ్జెక్టు నిపుణులు, ట్యూట‌ర్ల‌తో ప్రత్యేక శిక్ష‌ణ ఇప్పించ‌డం, విద్యార్థులు ఏ అంశాల్లో వెనుక‌బ‌డి ఉన్నారో ఆయా అంశాల‌పై ప‌ట్టు సాధించేలా చూడాల‌న్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు అసెస్‌మెంట్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించి, విద్యార్థుల పురోగ‌తిని విశ్లేషించాల‌న్నారు. విద్యార్థి జీవితంలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల ప్రాధాన్యం ఏంట‌నేదాన్ని తెలియ‌జెప్పి.. మంచి మార్కుల‌తో ఉత్తీర్ణ‌త సాధించేలా ప్రోత్స‌హించాల‌ని, ఇందుకు మోటివేష‌న‌ల్ త‌ర‌గ‌తుల‌ను కొన‌సాగించాల‌ని సూచించారు. ఉద‌యం, సాయంత్రం స‌మాయాల్లో ప్ర‌త్యేక స్ట‌డీ త‌ర‌గ‌తులు నిర్వ‌హించాల‌ని, స‌బ్జెక్టు ప‌రంగా విద్యార్థుల సందేహాల‌ను నివృత్తి చేస్తూ ప్రోత్స‌హించాల‌న్నారు. విద్యార్థులు మంచి మార్కుల‌తో ఉత్తీర్ణ‌త సాధించిన‌ప్పుడు వారి త‌ల్లిదండ్రుల‌కు ఎంత ఆనందం క‌లుగుతుందో అంత‌కంటే ఎక్కువ ఆనందం మ‌న‌కు సొంతమ‌వుతుంద‌ని, సామాజిక బాధ్య‌త‌గా విద్యార్థుల‌ను మంచి భ‌విష్య‌త్తు దిశ‌గా అడుగులేయించాల్సిన బాధ్య‌త ప్ర‌తిఒక్క‌రిపైనా ఉంద‌ని పేర్కొన్నారు. వ‌స‌తి గృహాలను ఎప్ప‌టిక‌ప్పుడు ఆక‌స్మికంగా త‌నిఖీ చేయ‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తెలిపారు.
స‌మావేశంలో డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాస‌రావు, సాంఘిక సంక్షేమ శాఖ సూప‌రింటెండెంట్లు ఎన్‌.సునీత‌, ఎ.ఆంజనేయులు, సహాయ సాంఘిక సంక్షేమ, వ‌స‌తి గృహ సంక్షేమ అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *