గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవరగా శాసనమండలి ఎన్నికల ప్రక్రియ నిర్వహణపై న్యూడిల్లీ నుంచి భారత ఎన్నికల సంఘం అధికారులు మంగళవారం రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ నిర్వహించారు. శిక్షణలో భాగంగా అధికారులు మాట్లాడుతూ శాసనమండలి ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేందుకు ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉప సంహరణ సక్రమంగా నిర్వహించాలన్నారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని ప్రక్రియలు ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకొని పటిష్టంగా చేపట్టాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ, సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ్ తేజ, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల సహాయక రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి అధికారులు పాల్గొన్నారు.
