-శాసనసభకు రాని వైసీపీ నేతల వల్ల రాష్ట్రానికి నష్టం
-టీడీపీ హయాంలో 70 శాతం పూర్తయిన పోలవరాన్ని నాశనం చేశారు
-ఆంధప్రదేశ్ కు రాజధాని లేకుండా చేశారు
-ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థులను గెలిపించాలి
-ఇటుక ఇటుక పేర్చి ఆంధ్రప్రదేశ్ ను పునర్నిమిస్తున్నాం
-విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్
అమరావతి\భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పూర్తి స్థాయిలో జరగాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించాలని పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయాన్ని కాంక్షిస్తూ భీమవరంలో మంగళవారం స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కూటమి నేతలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రాజశేఖర్ విజయానికి క్షేత్ర స్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ… రాష్ట్రంలో పూర్తి స్థాయి అభివృద్ధి జరగాలన్నా… ఆంధ్రప్రదేశ్ కు పూర్వ వైభవం రావాలన్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించాలన్నారు. ఏడు నెలల క్రితం జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎంత ఉత్సాహంగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారో… అదే విధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై చర్చించే శాసన సభకు రాకుండా… వైసీపీ నేతల రాకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. స్థానిక నేతలందరూ ఈ ఎన్నికలను బాధ్యతగా తీసుకుని… సమన్వయంతో కూటమి అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
పోలవరాన్ని ఉద్దేశ పూర్వకంగానే ఆపేశారు…
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందే ప్రతి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి కాలరాశాడని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. 2014 నుంచి 2019 వరకు ఐదేళ్ల టీడీపీ పాలనలో పోలవరం ప్రాజెక్ట్ 70 శాతం పూర్తి అయ్యిందన్నారు. తరువాత అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి ఉద్దేశ పూర్వకంగానే పోలవరం నిర్మాణాన్ని జాప్యం చేసి వికృతానందం పొందారన్నారు. పోలవరం పూర్తయితే వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో పాటు లక్షలాది ఎకరాలకు సాగునీరు అందేదని వివరించారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనత కూడా వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. అన్ని వ్యవస్థలనూ జగన్ సర్వ నాశనం చేశాడని మండిపడ్డారు. గత ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో రాష్ట్రానికి తీవ్ర నష్టం చేసిన వైసీపీ నేతలు… ఇప్పుడు సామాజిక, మీడియా మాధ్యమాల సాక్షిగా తప్పుడు ప్రచారాలకు తెగబడ్డారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ ఏడు నెలల అభివృద్ధిపై జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విష ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మవద్దని హితవు పలికారు. దీనిని తిప్పి కొట్టాలని పార్టీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని… కూటమి ప్రభుత్వం ఇప్ఫుడు ఇటుక ఇటుక పేర్చి మరలా ఆంధ్రప్రదేశ్ ను పునర్నిమిస్తుందని మంత్రి గొట్టిపాటి వెల్లడించారు.
పెన్షన్ల పెంపు నుంచి ఉచిత గ్యాస్ వరకు…
ఏడు నెలల కాలంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించినట్లు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ వివరించారు. సంక్షేమ పెన్షన్ల పెంపుతో పాటు మూడు ఉచిత గ్యాస్ సిలెండర్లు, అన్నార్తులకు అన్నాక్యాంటీన్లు ద్వారా నాణ్యమైన భోజనం, వందల కోట్ల రూపాయిలతో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లకు మరమత్తులు వంటివి ఎన్నో చేశామని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం… ఒక్కో హామీని నెరవేరుస్తున్నామని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన వెంటనే మెగా డిఎస్సీ నిర్వహించి వచ్చే విద్యా సంవత్సరానికి ఉపాధ్యాయులను అందుబాటులోకి తీసుకు వచ్చి విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామన్నారు. మహిళలకు ఉచిత బస్ పథకాన్నీ త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. గత ఐదేళ్లలో వైసీపీ చేసిన పాపాలకు ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా.. సంక్షేమ పాలనను కొనసాగిస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలందరూ గమనించాలని మంత్రి గొట్టిపాటి విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ చేస్తున్నవిష ప్రచారాలను, అసత్యాలను కూటమి కుటుంబ సభ్యులతో పాటు ప్రజలూ తిప్పి కొట్టాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థికి ఓటు వేయడం ద్వారా వైసీపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. త్వరలో జరగబోయే మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులందరూ గెలిచే విధంగా సమిష్టిగా కృషి చేయాలని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల ప్రజా ప్రతినిధులు, కూటమి నేతలు పాల్గొన్నారు. .