గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అన్న క్యాంటీన్లకు వచ్చిన వారికి ఆహారం అందలేదని ఫిర్యాదులు రాకుండా, డిమాండ్ కు తగిన విధంగా సరఫరా జరిగేలా అక్షయపాత్ర సిబ్బంది అందించాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. మంగళవారం మిర్చి యార్డ్ దగ్గరలోని అన్న క్యాంటీన్ ని జిఎంసి ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో అన్న క్యాంటీన్లకు పేద ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తుందన్నారు. నగరంలోని 7 క్యాంటీన్ల ద్వారా ప్రతిరోజు పూటకు రూ.5 కే ఆహారం తింటున్నారన్నారు. క్యాంటీన్లకు వస్తున్న పేదవారికి ఎవ్వరికీ ఆహారం అందలేదని ఫిర్యాదు రాకూడదని, అందుకు తగిన విధంగా ఆహారం సరఫరా జరిగేలా అక్షయపాత్ర సిబ్బంది అందించాలన్నారు. క్యాంటీన్ లో అందించే త్రాగునీటి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి క్యాంటీన్ లో నిర్దేశిత సమయంలో ఆహారం అందించాలని, అక్షయపాత్ర సిబ్బంది, జిఎంసి అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. క్యాంటీన్ లో క్యూ ఆర్ కోడ్ బోర్డ్ లు కనిపించేలా ఏర్పాటు చేయాలని, ప్రజలు తమ అభిప్రాయాలను క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా తెలియచేయవచ్చన్నారు.
