భీమవరం. నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పర్యటనలో భాగంగా గొల్లవానితిప్పలో కాలువపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెళ్లను తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు రామరాజు, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నారాయణ నాయకర్ తో కలిసి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పరిశీలించారు. 2015తో స్థలం వృద్ధా కాకుండా రూ. 5 కోట్ల వ్యయంతో పైలెట్ ప్రాజెక్ట్ కింద సింగిల్ మెగావాట్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. అయితే అనంతరం వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ సోలార్ ప్లాంట్ నిర్వహణను గాలికొదిలేసింది. దీంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ విషయాన్ని జిల్లా టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ రామరాజు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ దృష్టికి తీసుకొచ్చారు. మార్గ మధ్యంలో ఉన్న ప్లాంట్ వద్ద ఆగి పరిశీలించారు. తక్షణమే నెడ్ క్యాప్ అధికారులతో ఫోన్ మాట్లాడి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్లాంట్ ను నిర్వహణను చేపట్టి తిరిగి విద్యుత్ ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
దీనిపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడుతూ… వైసీపీ ప్రభుత్వం కోట్లాది రూపాయిల ప్రజధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. సోలార్ ప్లాంట్ల నిర్వహణను జగన్ ప్రభుత్వం గాలికొదిలేసిందని మండిపడ్డారు. ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో కనీసం ఒక్క మెగావాట్ ను పుట్టించిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. అధికారంలో ఉన్నంత కాలం దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రభుత్వానికి ఆదాయ మార్గాలపై దృష్టి సారించలేదు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు.