-విజయవాడ నోవాటెల్ హోటల్ లో వెస్టీన్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ విద్యార్థులతో జరిగిన కాపీ అండ్ కాన్వర్జేషన్ కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ వెల్లడి
-అతిథ్య రంగంలో యువతకు అద్భుతమైన ఉపాధి అవకాశాలున్నాయని తెలిపిన పర్యాటక మంత్రి కందుల దుర్గేష్
-విదేశాల్లో ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులకు వీసా కాపీలు అందించిన మంత్రి దుర్గేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిథ్య రంగం వేగంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన పెట్టుబడులను అన్వేషిస్తున్నామని, ఇప్పటికే పలు ప్రఖ్యాత కంపెనీలు అతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గురువారం సాయంత్రం విజయవాడ భారతీనగర్ లోని నోవాటెల్ హోటల్ లో వెస్టీన్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ విద్యార్థులతో జరిగిన కాపీ అండ్ కన్వర్జేషన్ కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ సంభాషించారు. అతిథ్య రంగంలో ఉన్న అవకాశాలను వివరించారు. అతిథ్య రంగం అభివృద్ధికి అవసరమైన సలహాలు, సూచనలు స్వీకరించారు. రాష్ట్రంలో తాజ్ గ్రూప్, ఒబెరాయ్, మేఫెర్ లాంటి ప్రఖ్యాత సంస్థలు అతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని వివరించారు. అత్యాధునిక సౌకర్యాలతో త్వరలోనే రాష్ట్రంలో రిసార్టులు, స్టార్ హోటళ్లు రాబోతున్నాయన్నారు. అతిథ్య రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా వచ్చిందని, నూతన పర్యాటక పాలసీ అంశాలను మంత్రి వివరించారు. ఇప్పటికే రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో ఇన్వెస్టర్స్ సమ్మిట్ లు నిర్వహించి ఇన్వెస్టర్ ల నుంచి ప్రతిపాదనలు స్వీకరించామని, రూ.1200 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని, 8 ఎంవోయూలు కుదుర్చుకున్న అంశాలను మంత్రి దుర్గేష్ తెలిపారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వంపై నమ్మకం ఉందని ఈ నేపథ్యంలో అతిథ్య రంగంలో అంతర్జాతీయ స్థాయి లగ్జరీ హోటళ్లు వచ్చే అవకాశముందన్నారు. ప్రాచుర్యం పొందిన పర్యాటక ప్రాంతాల్లో స్టార్ హోటళ్ల రాకతో అతిథ్య రంగం మరింత విస్తరించి ఉపాధి కలగనుందన్నారు. ఇప్పటికే అతిథ్య రంగంలో పలు ప్రతిపాదనలు పరిశీలించామని త్వరలోనే ఆయా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని ముందుకు వెళ్తామని, ప్రతి ఒప్పందం అమలయ్యేలా స్పష్టమైన కార్యాచరణ ఏర్పరుచుకుంటామన్నారు. రానున్న కాలంలో అతిథ్య రంగానికి అధిక ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ విద్యార్థులతో చాలా సేపు ముచ్చటించి వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అతిథ్య రంగంపై వారికి దిశానిర్దేశం చేశారు.
అంతేగాక రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో ఉన్న కట్టడాలను చూస్తే వాటి చారిత్రక నేపథ్యం తెలుస్తుందని, ఏపీలో కూడా అలాంటి తరహా కట్టడాలు చాలా ఉన్నాయని మంత్రి గుర్తుచేశారు. ప్రత్యేకించి రాష్ట్రంలోని గండికోట, చంద్రగిరి కోట, సిద్ధవటం కోట తదితర ప్రదేశాలు చారిత్రాత్మక సంపదకు ప్రతీకలన్నారు. వాటిని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో చర్యలు తీసుకుంటున్నామన్నారు.
రాష్ట్రంలో ప్రఖ్యాతి గాంచిన కూచిపూడి, భరతనాట్యం వంటి కళలకు పూర్వ వైభవం తెచ్చి కళల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిల సహకారంతో సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది పలికామన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పర్యాటక రంగంతో పాటు సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ రంగాలకు పెద్దపీట వేస్తున్నామన్నారు.సినిమాటోగ్రఫీ శాఖ అభివృద్ధి విషయమై ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి, స్వయాన నాటక రంగానికి చెందిన పవన్ కళ్యాణ్ తో చర్చించామని, త్వరలోనే సినీపెద్దలతో సమావేశం ఏర్పాటు చేయనున్నామన్నారు.
జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన కార్యక్రమం ఆద్యంతం ఆసక్తిగా సాగింది. కార్యక్రమం అనంతరం దుబాయ్, న్యూజిలాండ్, గ్రీస్, అమెరికా వంటి దేశాల్లో ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులకు మంత్రి కందుల దుర్గేష్ వీసా కాపీలను అందజేశారు.
కార్యక్రమంలో వోల్ స్మీ టెక్నాలజీ వ్యవస్థాపకులు మరియు ఛైర్మన్, టై గ్లోబల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ ఛైర్మన్ మురళీ బుక్కపట్నం, విద్యార్థులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News