– పాఠశాల విద్యలో 1, 2 తరగతులు చాలా కీలకమైనవి
– ప్రశ్నించి తెలుసుకునే ఆహ్లాదకర వాతావరణాన్ని ఉపాధ్యాయులు పెంపొందించాలి
– ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పాఠశాల విద్యలో 1, 2 తరగతులు చాలా కీలకమైనవని.. విద్యార్థి బంగారు భవితకు ప్రాథమిక విద్యే పునాదని, దీన్ని దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయులు.. చిన్నారులకు సమగ్ర నైపుణ్యాలను అందించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
ప్రాథమిక విద్యను బలోపేతం చేయడంలో భాగంగా విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నగరంలోని మేరీస్ స్టెల్లా కాలేజీలో జరుగుతున్న ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ లక్ష్మీశ పరిశీలించారు. 5వ బ్యాచ్‌గా 418 మంది ఉపాధ్యాయులకు ఈ నెల 3న శిక్షణ ప్రారంభం కాగా శనివారం చివరిరోజు కార్యక్రమానికి కలెక్టర్ హాజరై ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఉపాధ్యాయులే చిన్నారులకు రోల్ మోడల్స్ అని.. విద్యా నైపుణ్యాలతో పాటు ఉన్నత విలువలు, సత్ప్రవర్తన, క్రమశిక్షణనూ పెంపొందించేలా, ఎలాంటి భయం లేకుండా సందేహాలపై ప్రశ్నలు అడిగి, నివృత్తి చేసుకునేలా తరగతి గదిలో ఆహ్లాదకర వాతావరణాన్ని ఏర్పరచాలన్నారు. పేదరికం అడ్డంకులను తొలగించుకుంటూ బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగిన మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని చిన్నారులు రోజువారీ అభ్యసన కార్యక్రమాల్లో కొత్త ఉత్సాహంతో పాల్గొనేలా చూడాలని సూచించారు. మూడో తరగతి పూర్తిచేసే నాటికి నిర్దిష్ట స్థాయిలో చిన్నారులు చదవడం, రాయడం, గణిత సామర్థ్యాలను పెంపొందింపజేయాలనే ప్రధాన లక్ష్యంతో అత్యున్నత ప్రమాణాలతో ఉపాధ్యాయులకు శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఆరంభ దశలో చిన్నారుల సమగ్రాభివృద్ధికి దోహదం చేసే తరగతిగది ప్రణాళికల రూపకల్పనకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని కలెక్టర్ లక్ష్మీశ వివరించారు.
కార్యక్రమంలో డీఈవో యూవీ సుబ్బారావు, సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ జి.మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News