-ఏపీలో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో రెండు మండలాల్లో కార్యక్రమం
-ఈ ఏడాది మొదటి విడత మందుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా
-2030 నాటికి రాష్ట్రంలో బోదకాలు వ్యాప్తిని అరికడతామన్న రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్
-మంగళగిరి ఎపిఐఐసి టవర్స్ నుండి వీసీలో పాల్గొన్న మంత్రి సత్యకుమార్
-రాష్ట్రంలో 41 వేల బోదకాలు బాధితులు- గత దశాబ్దంలో దాదాపు 200 మందికి వ్యాధి సంక్రమణ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ వ్యాప్తంగా 2030 నాటికి బోదకాలు వ్యాధి విస్తరణను అరికట్టే కార్యక్రమంలో భాగంగా నేడు 13 రాష్ట్రాల్లోని 111 జిల్లాల్లో ఈ వ్యాధి నివారణ మందుల పంపిణీని చేపట్టారు. మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ గా పిలవబడే ఈ కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారంనాడు ప్రారంభించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ తో పాటు అన్ని రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వికసిత్ భారత్ నిర్మాణమే లక్ష్యంగా దేశం ముందుకు సాగుతున్నందున 2030 నాటికి దేశంలో బోదకాలు విస్తరణను పూర్తిగా నిర్మూలించే సమిష్టి ప్రయత్నం విజయం సాధించేందుకు రాష్ట్రమంత్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రజల భాగస్వామ్యంతో బోదకాలు వ్యతిరేక ఉద్యమాన్ని చేపట్టాలని ఆయన ఆకాంక్షించారు. ఈ వ్యాధి నిర్మూలన లక్ష్య సాధనకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఆరోగ్య శాఖా మంత్రి హామీ ఇస్తూ… ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్ని వివరించారు. మంగళగిరి ఎపిఐఐసి టవర్స్ ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి జరిగిని వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జి.వీరపాండియన్, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దోమ కాటు ద్వారా వ్యాప్తి చెందే బోదకాలు నిర్మూలనకు ప్రతి ఏడాదీ ఫిబ్రవరి మరియు ఆగష్టు మాసాల్లో వ్యాధి నిరోధక మందుల సరఫరా జరుగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని విజయనగరం జిల్లా గుర్ల, పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలాల్లో మందుల పంపిణీ చేపట్టారు. రెండేళ్లలోపు చిన్నారులు, గర్భిణీలు, తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారిని మినహాయించి ఇతరులందరికీ మందులు పంపిణీ చేస్తారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ వయసును బట్టి తగు మోతాదులో డిఇసి (డై ఇథైల్ కార్బామజైన్) మరియు అల్బెండజోల్ బిళ్లలను పంపిణీ చేస్తారు. ఈ మేరకు గుర్ల మండలంలో 61,015 మందికి, బలిజిపేట మండలంలో 57,875 మందికి బోదకాలు నివారణ మందుల పంపిణీ చేపట్టారు. మొత్తంగా 4,16,116 మందు బిళ్లల్ని పంపిణీ చేయాల్సి ఉంటుంది.
రాష్ట్రంలో మొత్తం 40,877 బోదకాలు వ్యాధి గ్రస్థులున్నారు. ఈ వ్యాధి నిరోధక కార్యక్రమాల ఫలితంగా వ్యాధి విస్తరణ తగ్గుముఖం పట్టి 2014 నుండి 196 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. ఇందులో అత్యధికంగా అవిభక్త విజయనగరం జిల్లాలో ఈ కాలంలో 77 మందికి బోదకాలు వ్యాధి సంక్రమించింది. 50 మంది వ్యాధి గ్రస్థులతో తూర్పుగోదావరి జిల్లా రెండో స్థానంలో ఉంది. కేంద్రం రూపొందించిన నియమాల మేరకు ఒక శాతం కంటే ఎక్కువ మంది ప్రజలకు బోదకాలు వ్యాపిస్తే ఆ ప్రాంతాల్లో మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమాన్నిచేపడతారు.
బోదకాలు వ్యాధిపై పోస్టర్లను ఆవిష్కరించిన మంత్రి
ఈ సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ బోదకాలు వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించే పోస్టర్లు, కరప్రతాల్ని విడుదల చేశారు. వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సియస్ ఎం.టి.కృష్ణ బాబు, కమీషనర్ జి.వీరపాండియన్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News