విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం ఈ రోజు విజయవాడ దాసరి భవన్లో జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పాల్గొని ప్రస్తుత రాజకీయ పరిణామాలను గురించి, భవిష్యత్ కర్తవ్యాలను గురించి వివరించారు. పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జెవి సత్యనారాయణ మూర్తి, జల్లి విల్సన్, అక్కినేని వనజ, జి.ఈశ్వరయ్య, పి.రామచంద్రయ్య, కెవివి ప్రసాద్, డి.జగదీష్, జంగాల అజయ్‌కుమార్, డేగా ప్రభాకర్‌లు పాల్గొన్నారు. సమావేశం ఈ దిగువ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది.
ఇటీవల హైదరాబాద్ పుస్తక మహోత్సవంలో ఎన్. వేణుగోపాల్‌పై జరిగిన దాడి, తిరుపతి పుస్తక మహోత్సవంలో విశాలాంధ్ర బుక్ హౌస్ స్టాల్లో ఒక పుస్తకాన్ని చించి తగలబెట్టడానికి చేసిన ప్రయత్నం, చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు రంగరాజన్ ఇంట్లోకి చొరబడి ఆయనపై చేసిన దాడులను సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గం తీవ్రంగా ఖండిస్తున్నది.
భావజాల వ్యతిరేకులతోపాటు భావజాల అనుకూలురు కూడా దాడికి లక్ష్యంగా మారుతున్నారు. హిందుత్వ అనుకూలవాదులు నడిపే యూట్యూబ్ చానెళ్లలో అది కొంతకాలంగా జరుగుతూనే ఉంది. ‘ధర్మరక్షణ’కు విరాళాల సేకరణ పేరిట డబ్బుకోణం కూడా దీనికి జతపడడం స్పష్టంగా కనిపిస్తోంది. కనుక ‘ధర్మరక్షణ’ లక్ష్యం కాస్తా డబ్బు సంపాదన లక్ష్యంగా మారినప్పుడు వ్యతిరేకులు, అనుకూలురన్న తేడా చెరిగిపోవడం సహజమే. కనుక ఇలాంటివి ముందు ముందు ఇంకా చూడడానికే ఎక్కువ అవకాశం ఉంది.
గత పది, పదకొండేళ్లుగా ఉత్తర భారత రాష్ట్రాల్లో, అందులోనూ హిందుత్వ భావజాలపక్షం, దానితో పొత్తు ఉన్న పక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఇలాంటి దాడులు విచ్చలవిడిగా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇతర పక్షాలు అధికారంలో ఉన్న దక్షిణాది రాష్ట్రాలలో కూడా పుంజుకుంటున్నాయి. ఈ విధంగా పార్టీ భేదాలు, ప్రాంతీయ భేదాలకు అతీతంగా హిందుత్వ జనాన్ని ‘ఒకటి’గా ముడివేస్తున్నారు.
21వ శతాబ్దం నుంచి మనం స్వాతంత్య్రం కన్నా ముందు రోజులకు, బ్రిటిష్ పాలన తొలిరోజులకు, ఇంకా అంతకన్నా వెనకటి రోజుల్లోకి వెళుతున్నాం. రాచరిక కాలంలో శాంతిభద్రతల వ్యవస్థ పటిష్ఠంగా ఉండేది కాదు. దోపిడీ దొంగలు స్వైరవిహారం చేసేవారు. ఇవన్నీ స్థూలంగా భారత దేశంలో ఒకప్పుడు శాంతిభద్రతల వ్యవస్థ ఎంత ఘోరంగా ఉండేదో చెబుతాయి. ఇప్పుడు ఓ రెండు శతాబ్దాల విరామం తర్వాత భారత్ తన స్వరూపాన్ని ఆసేతుహిమాచల పర్యంతం మరోసారి చాటుకుంటోంది. రాజుల కాలంలో కనీసం ఇంటి దగ్గర అయినా ఎంతోకొంత రక్షణ ఉండేదేమో కానీ, నేటి రాజ్యాంగబద్ధ, చట్టబద్ధ ప్రజాస్వామ్య భారతంలో ఇంటిదగ్గర కూడా రక్షణలేదని రంగరాజన్‌పై దాడి ఉదంతం చెబుతోంది.
రాజ్యాంగంలో పొందుపరచబడిన భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం వాటిల్లుతున్న నేటి తరుణంలో దీనిపై న్యాయస్థానాల్లో భావ ప్రకటనా స్వేచ్ఛపై సానుకూల తీర్పులొచ్చినప్పటికీ మతోన్మాద శక్తులు దాడులకు పాల్పడడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం తీవ్రంగా ఖండిస్తూ తీర్మానం చేస్తున్నది.
Prajavartha Online Telugu News