Breaking News

19 న రెండవ దశ శిక్షణ తరగతులు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లని పూర్తి చేసుకుని, 510 పోలింగ్ సిబ్బంది అయిన పీవో , ఏపీవో, ఇతర సిబ్బంది కి శిక్షణ ను ఫిబ్రవరి 14 తొలి దశ , 19 న రెండవ దశ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు.

గురువారం ఉదయం ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ద్వై వార్షిక ఎన్నికలు-2025 పై ఎన్నికల పరిశీలకులు శ్రీమతి కే. సునీత ఏలూరు నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ ప్రశాంతి, ఎస్పీ డి నరసింహ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎన్నికల పరిశీలకులు కే సునీత సూచనలు చేస్తూ, ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలింగ్ సిబ్బందికి శిక్షణ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు, పోలింగ్ మెటీరియల్స్ డిస్ట్రిబ్యూషన్, రిసిప్షన్ సెంటర్ ఏర్పాటు పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసుకోవాలని, అదనపు పోలీసు భద్రత సిబ్బంది అవసరం మేరకు ప్రతిపాదనలు పంపాలన్నారు.

జిల్లా కలెక్టర్ పీ ప్రశాంతి మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లాలో 92 పోలింగ్ కేంద్రాలు (82 పోలింగ్ కేంద్రాలు , 10 యాక్సిలరీ పోలింగ్ కేంద్రాలు) ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలో పోలింగ్ నిర్వహణ కోసం 102 మంది ప్రిసైడింగ్ అధికారులు, 102 మంది సహాయ ప్రిసైడింగ్ అధికారులు, 204 మంది ఇతర పోలింగ్ సిబ్బంది, 102 మంది మైక్రో అబ్జర్వర్స్ లను నియమించినట్లు తెలిపారు. పోలింగ్ సిబ్బందికి ఫిబ్రవరి 14 న తొలి శిక్షణ కార్యక్రమం, ఫిబ్రవరి 19 న రెండోవ విడత శిక్షణ కార్యక్రమం స్థానిక ఎస్ కే వి టీ డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో 8 జోన్ లను ఏర్పాటు చేసి, ఎనిమిది సెక్టార్ల అధికారులను, 20 ఫ్లయింగ్ స్క్వాడ్ లను, ఆరు స్టాటిస్టికల్ సర్వైవల్ బృందాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రశాంతి వెల్లడించారు.

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. వివిధ పత్రికల్లో, మాధ్యమాల్లో ప్రచురించిన ప్రసారం చేస్తున్న అనుకూల వార్తలు ప్రకటనలు, ఇంటింటి ప్రచారం పై నిఘా ఉంచామని తెలిపారు. సమాచార శాఖ కార్యాలయంలో మీడియా పాయింట్ ఏర్పాటు చేశామని తెలిపారు.

ఎస్పీ డి నరసింహ కిషోర్ మాట్లాడుతూ, ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు 780 మంది భద్రత సిబ్బందిని నియమించామని తెలిపారు. 58 రూట్స్ లో 17 స్ట్రైకింగ్ ఫోర్స్ తో కూడిన బృందాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పోలింగ్ మెటీరియల్స్ తరలించేందుకు 15 రూట్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికలు జరిగే ముందురోజు శివరాత్రి పండుగను దృష్టిలో ఉంచుకుని అదనపు పోలీసు బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు లేవని, గతంలో రాజమండ్రి లోని శ్రీ రామానుజ మునిసిపల్ హై స్కూల్ పోలింగ్ కేంద్రం (61 / 61-ఏ) వద్ద గొడవలు జరిగిన నేపథ్యంలో సున్నితత్వం గల పోలింగ్ కేంద్రం గా పరిగణించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు.

సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి / జిల్లా రెవిన్యూ అధికారి టీ. సీతారామ మూర్తి మాట్లాడుతూ, ద్వై వార్షిక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లాలో 62,970 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతోందని తెలిపారు. ఇందులో పురుషులు 36,361 మంది, స్త్రీలు 26,606 మంది, ఇతరులు ముగ్గురు ఉన్నారని తెలిపారు.

ఈ సమావేశంలో ఆర్డీవో ఆర్ కృష్ణ నాయక్, పీడీ డిఆర్డిఏ ఎన్ వివిఎస్ మూర్తి, డీఎల్డీవో పి వీణాదేవి, జిల్లా ఆడిట్ అధికారి జి పద్మజ రాణి, డీపీఆర్వో ఐ. కాశయ్య తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *