–14వ డివిజన్లో శ్రీలలితా పరమేశ్వరి అమ్మ వార్ల ఏసి కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మనుషుల మధ్య బంధాలు, బంధుత్వాలు, ఉమ్మడి కుటుంబంగా ఉండటం వల్ల కలిగే సంతోషాల గురించి నేటి తరానికి మనమందరం తెలియజేయాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. గురువారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 14వ డివిజన్ పటమట దర్శిపేటలోని శ్రీలలితా పరమేశ్వరి అమ్మ వార్ల ఏసి కల్యాణ మండపం ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ముఖ్య అతిధిగా హజరై కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ ఈ కళ్యాణ మండపం నిర్మాణం మొదలు పెట్టిన దగ్గర నుంచి ప్రారంభోత్సవంలో కూడా మహిళలు ముందంజలో ఉన్నారన్నారు. నిత్యం భజనలు, ప్రార్థనలు, పూజలు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. మహిళా శక్తి వల్లనే ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఏ.సీ కళ్యాణ మండపం పూర్తి చేసుకోగలిగామని చెప్పారు. ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడమే కాకుండా అందరం ఐక్యంగా ఉంటూ కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలన్నారు. ఇదే విషయాన్ని భవిష్యత్ తరాలకు కూడా తెలియజేయాలన్నారు. ప్రస్తుత తరుణంలో పిల్లలు వారి తల్లి, తండ్రి పేరు చెప్పగలుగుతున్నారే కాని తాత, ముత్తాత, అమ్మమ్మల పేర్లు చెప్పలేని స్థితిలో ఉన్నారని చెప్పారు. బంధం, బంధుత్వాల గురించి నేటి తరానికి మనమందరం తెలియజేయాల్సిన అవసరం చాలా ఉందన్నారు. తక్కువ ఖర్చుతో ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకునేలా ఈ ఏసి కళ్యాణ మండపాన్ని తీర్చిదిద్దారని నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ ఏసికళ్యాణ మండపం అందంగా చూడముచ్చటగా తీర్చిదిద్దిన మహిళా మణులను ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అభినందించారు.
ఆర్ఎస్ఎస్ ఇన్చార్జి భరత్‌కుమార్ మాట్లాడుతూ ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని దర్శిపేటలో ఘనంగా జరుపుకునే వారమని చెప్పారు. ప్రజలందరికి ఉపయోగ పడేలా ఇలాంటి కళ్యాణ మండపాన్ని నిర్మాణం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆస్తులతో పాటుగా కుటుంబ విలువలను నేటి తరానికి తెలియజేయాలన్నారు. అమ్మాయితో పాటుగా, అబ్బాయిలకు సమాజంలో ఎలా ఉండాలనే విషయాన్ని నేర్పించాలన్నారు. ఉమ్మడి కుటుంబంగా ఉండటం వల్ల కలిగే సంతోషాలను గురించి నేటి తరానికి తెలియజేయాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో గుడి కమిటీ చైర్మన్ ఆవుల నాసరయ్య, పోతంశెట్టి నాగేశ్వరరావు, ముమ్మనేనిప్రసాద్, చింతల సాంబయ్య, రావి సౌజన్య నర్రా కిషోర్ కతదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News