విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రిస్ప్, యస్ పి వై ఎమ్ స్వచ్ఛంద సంస్థల సహకారంతో యువత లో మాదకద్రవ్యాల వినియోగానికి చెక్ పెట్టేందుకు మూడు రోజులుగా కొత్తపేట కే బీ ఎన్ కళాశాలలో జరుగుతున్న “నవచేతన ” అవగాహన సదస్సు గురువారం ఘనంగా ముగిసింది.
ముఖ్య అతిథులుగా పాల్గొన్న పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, కే బీ ఎన్ కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నారాయణ రావు చేతుల మీదుగా అవగాహన సదస్సులో పాల్గొన్న ఉపాధ్యాయులకు, విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేశారు. ఢిల్లీకి చెందిన ప్రముఖ ట్రైనర్లు గ్యారీ రైడ్, అహ్మద్ బిలాల్, డాక్టర్ సునీల్ కుమార్ లు పశ్చిమ లోని వివిధ పాఠశాలల, కళాశాలల ఉపాధ్యాయులకు , విద్యార్థినీ విద్యార్థులకు మాదకద్రవ్యాలు అలవాటు పడితే వచ్చే పర్యావసనాలపై” నవ చేతన “అవగాహన సదస్సు ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా తమని తాము ఎలా రక్షించుకోవాలో తెలిసిందని డ్రగ్స్ కి దూరంగా ఉంటామని విద్యార్థులు చెబుతున్నారు. యువతను చెడు మార్గం పట్టిస్తున్న మత్తు పదార్థాల వినియోగం రోజురోజుకీ పెరుగుతోందని, మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు నవ చేతన కార్యక్రమం ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకున్నామని ఇలాంటి అవగాహన కార్యక్రమాల వల్ల విద్యార్థులు చైతన్యం అయ్యి చదువులపై దృష్టి పెట్టేందుకు ఆస్కారం ఉందని పలువురు ఉపాధ్యాయులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
యస్ పి వై ఎమ్ ట్రైనర్ గ్యారీ రైడ్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే పాఠశాలల్లో మాదక ద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించడం మరింత విస్తృతం చేయాలన్నారు .ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత గా ఈ మాదక ద్రవ్య వ్యతిరేక కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళుతూ మంచి ఫలితాలు రాబడతారని ఆశించారు. విద్య దేశం యొక్క సామాజిక ,ఆర్థిక వ్యవస్థల సమతోల్యతలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు అన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో నేర్చుకున్న అంశాలను ఉపాధ్యాయులు అధ్యయనం చేస్తూ భావితరాల భవిష్యత్తు కోసం కృషి చేయాలని ట్రైనర్ గ్యారీ రైడ్ కోరారు.
కార్యక్రమంలో సుజనా ఫౌండేషన్ ఆపరేషన్స్ హెడ్ వీరమాచనేని కిరణ్, హరీష్, మంతెన తరుణ్, చింతా బాబీ క్రిస్ప్ స్వచ్ఛంద సంస్థల సిబ్బంది మనీషా, నేహా తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News