-షష్ట షణ్ముఖ క్షేత్ర యాత్రకు శ్రీకారం
-కంద షష్టి కవచ పారాయణంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆది ప్రణవనాదం ఓం కార మంత్ర రహస్యాన్ని సృష్టికి అందించిన క్షేత్రం.. షష్ట షణ్ముఖ క్షేత్రాల్లో ఐదవ క్షేత్రం స్వామిమలై. అక్కడ కొలువైన శ్రీ స్వామినాథ స్వామి వారిని రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా గురువారం తంజావూరు సమీపంలోని స్వామిమలైని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కన్నన్ గురుకల్… సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. పంచ హారతులతో హారతి ఇచ్చారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ధ్వజస్థంభానికి మొక్కారు. స్వామినాథ స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన కంద షష్టి కవచ పారాయణంలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన కుమారుడు అకీరా నందన్, తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ ఆనంద్ సాయి ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నారు.
శ్రీ సుందరేశ్వరన్, మీనాక్షీ అమ్మన్ దర్శనం
శ్రీ స్వామినాథ స్వామి దర్శనానంతరం ఆలయంలో వెలసిన ఆదిదంపతులు శ్రీ సుందరేశ్వరన్ స్వామి, మీనాక్షి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ కమిషనర్ ఉమా దేవి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
Prajavartha Online Telugu News