-మంత్రపీఠేశ్వరి అమ్మవారికి అర్చనలు
-శ్రీ అగస్త్య కుంభముని ధ్యాన పీఠ సందర్శన
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ పుణ్య క్షేత్ర యాత్రలో భాగంగా గురువారం తమిళనాడులోని కుంభకోణంలో ఉన్న శ్రీ ఆది కుంభేశ్వరుడిని దర్శించారు. ఈ ఆలయంలో శివలింగంతోపాటు ప్రతి అణువు ప్రత్యేకతను కలిగి ఉంటాయి. కుంభేశ్వరాలయ దర్శనానికి ఎవరు వచ్చినా మొదట ఆది గణపతి దర్శనం తర్వాతే మూల విరాట్ దర్శించాలన్న నియమం ఉంది. ఆలయ సంప్రదాయం మేరకు పవన్ కళ్యాణ్ ఆదివినాయగర్ ని మొదట అర్చించారు. శ్రీ ఆదికుంభేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమృత భాంఢం(కూజా) ఆకారంలో ఉన్న శివలింగ విశిష్టతను పవన్ కళ్యాణ్ కి అర్చకులు వివరించారు. అమృతం, ఇసుక కలిసి ఉద్భవించిన ఈ లింగానికి అభిషేకాలు నిర్వహించరని తెలిపి, విశిష్ట పూజలు నిర్వహించారు. పంచ హారతులు ఇచ్చి స్వామి వారి తీర్ధప్రసాదాలు అందజేశారు. పవన్ కళ్యాణ్ తో ఆయన తనయుడు అకీరా నందన్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయిలు స్వామి వారిని దర్శించుకున్నారు.
శ్రీ మంగళనాయకి అమ్మన్ దర్శనం
ఆది కుంభేశ్వరాలయంలో స్వామి వారికి ఎడమవైపు వెలసిన పార్వతీదేవి అవతారం శ్రీ మంగళనాయకి అమ్మాన్. అమ్మవారిని మంత్రపీఠేశ్వరిగానూ కొలుస్తారు. 72 కోట్ల మంత్రాల శక్తి అమ్మవారిలో నిక్షిప్తమై ఉండడం వల్ల అమ్మవారికి ఆ పేరు వచ్చింది. ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
ధ్యాన పీఠ సందర్శన
శ్రీ ఆది కుంభేశ్వరాలయ ప్రాంగణంలో ఉన్న మరో విశిష్ట ప్రదేశం శ్రీ అగస్త్య ధ్యాన పీఠ మందిరం. అమ్మవారి దర్శనానంతరం పవన్ కళ్యాణ్ ప్రధాన ఆలయానికి నైరుతి దిశలో ఉన్న ఈ ధ్యానపీఠాన్ని సందర్శించారు. ఈ ప్రాంతంలో కూర్చుంటే తెలియకుండానే ధ్యాన ముద్రలోకి వెళ్లిపోతారని ధ్యాన మందిర విశిష్టతను అర్చకులు పవన్ కళ్యాణ్ కి వివరించారు. అంతకు ముందు ఆలయ ఆస్థాన గజం మంగళంతో కలసి అర్చకులు, అధికారులు, ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలికారు. ఆలయ ఆస్థాన ఏనుగుకు అరటి పళ్లు అందించి ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి మురుగన్, ట్రస్ట్ బోర్డు సభ్యులు బాల సుబ్రహ్మణ్యం, శంకర రాణి, చిదంబరం తదితరులు దర్శనానంతరం స్వామి, అమ్మవార్ల చిత్రపటాలను అందించి పవన్ కళ్యాణ్ ని సత్కరించారు.
ఇప్పటికి స్వామివారి అనుగ్రహం లభించింది : పవన్ కళ్యాణ్
నాలుగు సంవత్సరాలుగా శ్రీ అగస్త్య మహా ముని ఆలయం, స్వామిమలై శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్ర దర్శనం కోసం వేచి చూస్తున్నానని, ఇప్పటికి ఆ మురుగన్ అనుగ్రహం లభించడంతో క్షేత్ర దర్శనం చేసుకోవడానికి వచ్చినట్టు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాజకీయ అంశాల గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆలయాల్లో రాజకీయాలు వద్దు అంటూ సున్నితంగా బదులిచ్చారు.
బీజేపీ శ్రేణుల ఘన స్వాగతం
స్వామిమలై, కుంభకోణం సందర్శనకు విచ్చేసిన పవన్ కళ్యాణ్ కి భారతీయ జనతా పార్టీ తమిళనాడు శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పూల మాలలు, శాలువాలతో బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్ ని సత్కరించారు. బాణసంచా పేల్చి సంబరాలు చేశారు. శ్రీ కుంభేశ్వరాలయంలో తనను చూసేందుకు వచ్చిన తెలుగు విద్యార్ధులకు పవన్ కళ్యాణ్ సెల్ఫీలు ఇచ్చి ఉత్సాహపరిచారు.
Prajavartha Online Telugu News