Breaking News

మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం, మంచి జీవన విధానం ద్వారా క్యాన్సర్ రాకుండా నివారించవచ్చును

-క్యాన్సర్ రహిత రాష్ట్రంగా ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ దిశగా ప్రభుత్వం చర్యలు: జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్
-వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్డ్ రీసర్చ్ ( స్వీకార్) టాటా క్యాన్సర్ హాస్పిటల్ వారు క్యాన్సర్ పై అందిస్తున్న సేవలు ఎనలేనివి.. జంక్ ఫుడ్ ని, ప్లాస్టిక్ వాడకాన్ని నివారించాలి: ఎంఎల్ఏ ఆరని శ్రీనివాసులు
-క్యాన్సర్ ముందుగానే గుర్తించడం ద్వారా మెరుగైన చికిత్స ద్వారా ప్రాణం కాపాడుకోవచ్చు: జిల్లా ఎస్పీ హర్ష వర్ధన్ రాజు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
క్యాన్సర్ ముందుగానే గుర్తించడం ద్వారా మెరుగైన చికిత్స ద్వారా ప్రాణం కాపాడుకోవచ్చునని,మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం, మంచి జీవన విధానం ద్వారా క్యాన్సర్ రాకుండా నివారించవచ్చునని, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్సర్ రీసర్చ్ ( స్వీకార్) టాటా క్యాన్సర్ హాస్పిటల్ వారు క్యాన్సర్ పై అందిస్తున్న సేవలు ఎనలేనివని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, తిరుపతి ఎంఎల్ఏ ఆరని శ్రీనివాసులు పేర్కొన్నారు.

శుక్రవారం ఉదయం ప్రపంచ క్యాన్సర్ దినం 2025 నేపథ్యంలో టాటా క్యాన్సర్ హాస్పిటల్ (స్వీకార్) వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ అవగాహన 5కే వాకథాన్ మరియు సైకిల్ ర్యాలీని నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ నుండి జిల్లా కలెక్టర్, ఎస్పీ, తిరుపతి ఎంఎల్ఏ సంబంధిత టాటా క్యాన్సర్ హాస్పిటల్ ప్రతినిధులు డాక్టర్ ప్రశాంత్, డిఎంహెచ్ఓ బాలాజీ నాయక్, ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పార్థసారథి లతో కలసి జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ క్యాన్సర్ డే నేపథ్యంలో నేడు క్యాన్సర్ అవగాహన ర్యాలీ కార్యక్రమాలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు నివారణ ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు అలాగే క్యాన్సర్ వచ్చినా కూడా దానిని ముందుగానే గుర్తించడం ద్వారా ముదరకుండా చికిత్స పొంది ప్రాణాలు కాపాడుకోవచ్చని అన్నారు. ప్రతి రోజూ వ్యాయామం చేయడం, మంచి జీవన విధానం, మంచి ఆహార అలవాట్ల ద్వారా క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అని పేర్కొన్నారు. చిన్న వయసు నుండే మంచి జీవన విధానం అలవర్చుకోవాలని, జంక్ ఫుడ్ తినరాదని సూచించారు. మంచి ఆహారపు అలవాట్లు, క్రీడలు, వ్యాయామం బడి ఈడు నుండే పిల్లలు అలవర్చుకోవాలని సూచించారు. క్యాన్సర్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా మన రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహణ ద్వారా క్యాన్సర్ ను ముందుగానే గుర్తించి చికిత్స అందించే దిశగా చర్యలు చేపట్టిందని అన్నారు. సర్వైకల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రభుత్వ ఇనిషియేటివ్ ద్వారా కొనసాగుతోందని, ఐదు ఆరు నెలల్లో సర్వే పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. పింక్ బస్ ల ద్వారా స్క్రీనింగ్ గ్రామాల్లో షెడ్యూల్ ఏర్పాటుతో నిర్వహిస్తున్నామని గ్రామాల్లో మహిళలు, పురుషులు అనుమానిత లక్షణాలు ఉన్నవారు పరీక్ష చేయించుకోవాలని ఇది వారి ఆరోగ్యం పరిరక్షణ కొరకు ఏర్పాటు చేస్తున్న స్క్రీనింగ్ అని తెలిపారు. అన్ని వయసుల వారు ప్రతి రోజూ వ్యాయామం, మానసిక ప్రశాంతత, మంచి ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలని, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆరోగ్యకరమైన సమాజం ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. నేడు 5కే వాకథాన్, సైకిల్ థాన్ నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.

తిరుపతి ఎంఎల్ఏ మాట్లాడుతూ ప్రపంచ క్యాన్సర్ దినం 2025 పురస్కరించుకుని నేడు ప్రజల్లో చైతన్యం కలిగించడానికి అవగాహన ర్యాలీ నిర్వహించుకోవడం సంతోషించదగినదని అన్నారు. గతంలో క్యాన్సర్ కు చికిత్స లేదని భయపడే వారని, కానీ నేడు మంచి అధునాతన టెక్నాలజీ అందుబాటులో ఉందని, మెరుగైన చికిత్సకు అవకాశాలు ఉన్నాయనీ పేర్కొన్నారు. జంక్ ఫుడ్ తినరాదని, ప్లాస్టిక్ వాడకం, ఆహార పదార్థాలను ప్లాస్టిక్ లో భద్ర పరచడం మంచిది కాదని, శాఖాహారం అలవాటు చేసుకోవాలని, ఆరోగ్యకరమైన మంచి ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలని అన్నారు. టాటా క్యాన్సర్ హాస్పిటల్ వారు చేపడుతున్న పలు క్యాన్సర్ అవగాహన, నివారణ కార్యక్రమాలు, క్యాన్సర్ చికిత్సకు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ క్యాన్సర్ తీవ్రతరం కాకుండా ముందుగానే గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రాణాంతకం కాకుండా చూడవచ్చు అని, మంచి జీవన విధానం ద్వారా క్యాన్సర్ రాకుండా నివారించుకోవచ్చని తెలిపారు. ప్రపంచ స్థాయి కొత్త టెక్నాలజీ తో మంచి చికిత్స అందిస్తున్న టాటా క్యాన్సర్ హాస్పిటల్ (స్వీకార్) వారికి అభినందనలు తెలిపారు.

Dr. ప్రశాంత్ స్వీకార్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ మాట్లాడుతూ క్యాన్సర్ రాకుండా నివారించవచ్చని, క్యాన్సర్ సకాలంలో ముందుగా గుర్తించడం ద్వారా మెరుగైన వైద్యం ద్వారా ప్రాణాపాయం లేకుండా కోలుకోవచ్చని తెలిపారు.

సదరు ర్యాలీ నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ మైదానం నుండి టాటా క్యాన్సర్ హాస్పిటల్ వరకు ప్లే కార్డులు ధరించి, క్యాన్సర్ అవగాహన నినాదాలతో కొనసాగింది. ర్యాలీ అనంతరం టాటా క్యాన్సర్ హాస్పిటల్ నందు పలువురికి క్యాన్సర్ పై అవగాహన కల్పించి పలు సందేహాలు నివృత్తి చేశారు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డిపిఎంఓ డా.శ్రీనివాసులు, పలువురు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ప్రజలు, యువత, విద్యార్థినీ విద్యార్థులు, టాటా క్యాన్సర్ హాస్పిటల్ ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *