-అన్నదానం మహా భాగ్యం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మానవ జీవితంలో భగవంతుని అనుగ్రహం పొందేందుకు ఎన్నో మార్గాలు ఉన్నప్పటికీ వాటిలో ధార్మిక కార్యక్రమాల నిర్వహణ ద్వారా భగవంతుని అనుగ్రహం పొందడం అత్యుత్తమ మార్గమని విజయవాడ నగరపాలక సంస్థ కార్పోరేటర్ టిడిపి ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి అన్నారు. తాడేపల్లి ఆశ్రమం రోడ్ లోని బి.ఎ. విల్లా నివాసులు బొడ్డకాయల దుర్గాప్రసాద్, హైమావతి దంపతుల సహకారంతో తిరుమల తిరుపతి దేవస్థానం నిత్య అన్నదాన పదకానికి విరాళం గా సరఫరా చేస్తున్న 10 టన్నుల కూరగాయల వాహనానికి ఆదివారం ఆయన జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా బాల స్వామి మాట్లాడుతూ హిందువులు భక్తిప్రపత్తులతో దర్శించుకునే ఆరాధ్య దైవం, కలియుగ వైకుంఠం ఏడుకొండలపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి సాయం చేసే అవకాశం సామాన్యులకు కూడా కల్పించడం ఎంతో ముదావహమన్నారు.ఈ మహత్కార్యానికి నగరంలో ఆద్యుడైన దివంగత మండవ కుటుంబరావు ఆశయాలను కొనసాగించేందుకు ఎంతో మంది సాధారణ భక్తులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఇటీవల రాష్ట్రంలో ప్రభుత్వం మార్పు తర్వాత స్వామివారిని దర్శించుకునే భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తోందన్నారు.
సమాజంలో ఎంతోమంది తమ తమ ఆకాంక్షల మేరకు సమాజ సేవకు వారి పరిధి మేరకు అందిస్తున్న సేవల్లో అన్నదానానిదే అత్యున్నత స్థానమన్నారు. మనం చేసే మంచి కర్మలే తిరిగి మనకు మంచి ఫలితాలు
ఇస్తాయన్నారు.
కూరగాయలను విరాళంగా అందించిన దుర్గాప్రసాద్, హైమావతి దంపతులు మాట్లాడుతూ నాలుగు దశాబ్దాల క్రితం దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆలోచనల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా స్వామి వారికి సేవ చేసుకునే అదృష్టం మాకు
కలిగిందన్నారు.
కార్యక్రమ నిర్వాహకులు మరడ నాగేంద్ర మాట్లాడుతూ ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని 2006లో ప్రారంభించడం జరిగిందని,రాష్ట్రంతో పాటు వేసి విదేశాలలోని స్వామివారి భక్తులు గత 18 సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి కూరగాయలను వితరణగా అందిస్తున్నారన్నారు. దేవదేవుడుని దర్శించుకునే ప్రతి భక్తునికి దాతలు వితరణ చేస్తున్న కూరగాయలతోనే అన్నదానం నిర్వహిస్తోందన్నారు. లక్షలాది మందికి ప్రతిరోజు ఆహారాన్ని అందించడం ఎంతో కష్టమైన సేవ అని పేర్కొన్నారు. జీవితంలో స్థిరపడిన ప్రతి ఒక్కరి విజయం వెనుక భగవంతుని కృప ఉంటుందన్నారు.
భగవంతుని అనుగ్రహంతో, దాతల సహకారంతో రానున్న రోజుల్లో మరిన్ని ధార్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో శీలంశెట్టి చిన్న, నాగేశ్వరరావు, యార్లగడ్డ ఉపేంద్ర, సుంకర శ్రీనివాసరావు, కంతేటి రాంమోహన్, వేమూరి ప్రసాద్, స్థానిక భక్తులు పాల్గొన్నారు.