-అక్రమాలు, క్రమశిక్షణా రాహిత్యం ఫిర్యాదుపై కెజిహెచ్ డాక్టర్ బదిలీ
-సమగ్ర విచారణకు ఆదేశించిన మంత్రి సత్యకుమార్ యాదవ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వాసుపత్రుల సేవల్ని మెరుగుపర్చే ప్రయత్నాల్లో భాగంగా విధులు సరిగా నిర్వర్తించకుండా అక్రమాలు, క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడుతున్నడాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య,ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. 2019-24 కాలంలో అప్పటి ప్రభుత్వ అలసత్వం వల్ల ప్రభుత్వ వైద్యుల్లో నెలకొన్న నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం మరియు సర్వీసు నిబంధనల్ని ఉల్లంఘించే వైఖరిపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
దారితప్పి వ్యవహరిస్తున్న డాక్టర్ల వైఖరిని కట్టడి చేసే చర్యల్లో భాగంగా విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ప్రభుత్వాసుపత్రిలో ఆర్థోపెడిక్స్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ అంపోలు అచ్యుతరావును తక్షణమే ఏలూరు ప్రభుత్వ సర్వజనాసుపత్రికి బదిలీ చేయాల్సిందిగా మంత్రి ఆదేశాలిచ్చారు. ఆయనపై వచ్చిన పలు ఫిర్యాదులపై వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని కూడా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉత్తర్వులిచ్చారు.
డాక్టర్ అచ్యుతరావు వికలాంగులకిచ్చే సదరం సర్టిఫికెట్ల జారీలో అక్రమాలకు పాల్పడినట్లు, ఆపరేషన్లు చేయడానికి డబ్బు తీసుకుంటున్నట్లు, ఆయన చేసిన శస్త్ర చికిత్సల్లో వైఫల్యాలు ఎక్కువగా ఉన్నట్లు, సహచర సిబ్బంది మరియు వైద్య విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇతర సీనియర్ల ఆదేశాల్ని ఉల్లంఘిస్తున్నట్లు ఆరోపణలు మంత్రి దృష్టికొచ్చాయి. ఈ వైఖరి ద్వారా డాక్టర్ అచ్యుతరావు డాక్టర్ల ప్రవర్తన మరియు సర్వీసు నియమాల్ని ఉల్లంఘించినందున మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ చర్యలకు ఆదేశించారు.
డాక్టర్ల అనుచిత ప్రవర్తన, క్రమశిక్షణా రాహిత్యం వల్ల ప్రజలకు మెరుగైన సేవలందించే లక్ష్యం దెబ్బతింటుందంటూ అటువంటి విషయాల్లో కఠిన చర్యలు ఎంతయినా అవసరమని మంత్రి పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News