విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధాని మోదీ అమెరికా పర్యటన అదానీని కేసుల నుంచి తప్పించేందుకేనని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆరోపించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు దేశాభివృద్ధి కోసం… తద్వారా వాటి ఫలాలు ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ప్రధానులు ఇతర దేశాలు పర్యటించేవారని, మోదీ పర్యటనలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని విమర్శించారు. దీంతో భారతదేశ అఖండత, ప్రతిష్టత దెబ్బతినేలా ఉందన్నారు. గతంలో ఎందరో ప్రధానులు అమెరికా అధ్యక్షుడినే కలిశారు తప్ప కిందిస్థాయి నేతలను కలవలేదన్నారు. దేశ ప్రయోజనాలు గాని అక్రమం వలసలు గురించి గాని చర్చించిన దాఖలాలు లేవన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ హరించిపోతుందన్నారు. ఈవీయంల ట్యాంపరింగ్ ద్వారానే బీజేపీ గెలుస్తోందన్నారు. కుంభమేళాకు వెళ్తూ… దిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా, గజీమాబాదులో శవాలను కాల్చేశారన్నారు. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో చదువుకునే అమ్మాయిలకు భద్రత కరువైందన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. జగన్ అంటే జనానికి భయం. అందుకే ప్రజలు కూటమి పార్టీలకు ఓట్లే వేసి గెలిపించారన్నారు. చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలుచేయకపోవటంతో ప్రజలు నిరాశతో ఉన్నారన్నారు.
Prajavartha Online Telugu News