-పి.బి. సిద్ధార్థ కళాశాల సదస్సులో ప్రొ. మల్లయ్య
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శాస్త్ర,సాంకేతిక ఆవిష్కరణలతోనే వ్యవసాయరంగం బలోపేతమై, గ్రామీణాభివృద్ధి కల సాకారమవుతుందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆచార్యులు డాక్టర్ ఎల్.ఎస్.మల్లయ్య అన్నారు. విజయవాడలోని పి.బి సిద్ధార్థ కళాశాల ఆర్ధికశాస్త్ర విభాగం నిర్వహణలో రెండురోజుల జాతీయ సదస్సును శుక్రవారం ఉదయం ఆయన ప్రారంభించారు. దేశ ఆర్థికాభివృద్ధికి ఆర్థిక దోహదపడే ఆవిష్కరణలపై ప్రస్తుత తరం మరింత పరిశోధన చేయాలని కోరారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్, రోబోల సహకారంతో మనదేశంలో వ్యవసాయరంగం మున్నెన్నడూ లేనంతగా ఆర్థికవ్యవస్థను ప్రభావితం చేయబోతోందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్, సెమినార్ డైరెక్టర్ డాక్టర్ మేకా రమేష్ మాట్లాడుతూ వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిలో ఆవిష్కరణల పాత్రపై రెండురోజుల సెమినార్ నిర్వహిస్తున్నామన్నారు. నూతన సాంకేతికతతోనే వ్యవసాయరంగం ఆర్థికవ్యవస్థకు ఆలంబనగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ అకడమిక్ అడ్వయిజర్ ఆచార్య ఎల్ .కె. మోహన్రావు, డీన్ ఆచార్య రాజేష్ సి. జంపాల, ఆచార్య నాగార్జున వర్సిటీ ప్రొఫెసర్ కె. మధుబాబు, కళాశాల డైరెక్టర్ వి. బాబురావు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డా. రోహిణి కుసుమ, డా. సూర్య ప్రకాశరావు పాల్గొన్నారు. ఉభయ రాష్ట్రాల నుంచి పలువురు హాజరై పత్రాలు సమర్పించారు.
Prajavartha Online Telugu News