మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
వాహన చోదకులు హెల్మెట్, సీట్ బెల్టు ధరిస్తే చాలావరకు రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ వారి చాంబర్లో శుక్రవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం జరిగింది. రోడ్డు ప్రమాదాల స్థితిగతులు, డ్రంక్ అండ్ డ్రైవ్, హిట్ అండ్ రన్ మోటార్ యాక్సిడెంట్ కేసులు, రహదారులపై బ్లాక్ స్పాట్లకు తీసుకున్న చర్యలు, రహదారి భద్రత అవగాహన కార్యక్రమాలపై చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2025 జనవరి నెలలో జిల్లాలోని వివిధ ప్రాంతాలలో 90 రోడ్డు ప్రమాదాలు జరగడం, వాటిలో 41 మరణాలు సంభవించటం, 76 మంది గాయాలపాలవడం ఆందోళనకరంగా ఉందన్నారు. ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్, సీట్ బెల్టు తప్పనిసరిగా ధరించే విధంగా పోలీసులు కఠినంగా వ్యవహరించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
జిల్లాలోని జాతీయ రహదారులపై ఏఐ పవర్ సిసి టీవీల సాంకేతిక పరిజ్ఞానంతో అధిక వేగంతో వెళ్లే వాహనాలను గుర్తించడం, అదేవిధంగా హెల్మెట్ లేకుండా ప్రయాణించే వాహనచోదకులను గుర్తించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని, అట్టివారికి కఠినంగా జరిమానాలు విధించాలని సూచించారు.
మచిలీపట్నం మండలం ఎస్ఎన్ గొల్లపాలెం గ్రామంలోని విద్యార్థులు సమీపంలోని 216 జాతీయ రహదారిని దాటుకుని జాతీయ కళాశాలకు చేరుకునేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్న విషయం తన దృష్టికి వచ్చిందని, రహదారిపై అకస్మాత్తుగా వచ్చే వాహనాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ పరిష్కార మార్గాల కోసం రవాణా శాఖ, జాతీయ రహదారులు, పోలీసు అధికారులు ఉమ్మడి తనిఖీ నిర్వహించాలన్నారు.
మచిలీపట్నం నగరంలో రహదారి వెంబడి ఏర్పాటు చేసిన శుభకార్యాలు, పుట్టినరోజు శుభాకాంక్షలు, ఇతర కార్యక్రమాలకు సంబంధించిన బ్యానర్లు, ఫ్లెక్సీలు ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే తొలగించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కు సూచించారు. అదేవిధంగా నగరంలోని అన్ని పశువుల కొమ్ములకు రేడియం పెయింట్స్ వేయించాలని, తద్వారా రోడ్డు ప్రమాదాలు జరగకుండా రాత్రి వేళల్లో వాహన చోదకులు వాటిని సులువుగా గుర్తించేందుకు అవకాశం ఉందన్నారు.
స్థానిక జిల్లా పరిషత్ సెంటర్ జంక్షన్ వద్ద గల ప్రధాన రహదారిపై వంగిపోయిన స్తంభాన్ని వెంటనే తొలగించాలని సూచించారు. అదేవిధంగా మూడు స్తంభాల సెంటరు నుంచి వచ్చే బైపాస్ రోడ్డులో వినాయకుడి గుడి సమీపంలో భారీ గుంటకు (పాట్ హోల్) మరమ్మతులు చేపట్టాలన్నారు.
హెల్మెట్, సీటు బెల్టు ధరించడం మూడు రోజుల ముచ్చటగా కాకుండా నిత్యం ధరించేలా వాహన చోదకులకు నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
జిల్లా వ్యాప్తంగా 83 హిట్ అండ్ రన్ కేసులు నమోదు కాగా, వాటిలో 23 కేసులకు సంబంధించిన బాధితులకు నష్టపరిహారం చెల్లించినట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు.
సమావేశంలో జిల్లా రవాణా అధికారి బి ఎస్ ఎస్ నాయక్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎల్ సిద్ధిక్, నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, రహదారులు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లోకేష్, డిఎంహెచ్వో డాక్టర్ శర్మిష్ఠ, జాతీయ రహదారులు, పోలీసు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News