గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కార్మికుల కుటుంబాలకు గుంటూరు నగర పాలక సంస్థ అండగా ఉంటుందని, కార్మికులకు అందాల్సిన పరిహారాలు వెంటనే అందిచడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. ఇటీవల మరణించిన ప్రజారోగ్య విభాగ ఔట్సొర్సింగ్ కార్మికులు బండి భవాని కుటుంబ సభ్యులకు ఎక్స్ గ్రేషియా చెక్ ను మరియు ఈ నెల 18న ప్రమాదంలో మరణించిన గొర్రెముచ్చు కొండమ్మ కుటుంబ సభ్యులకు మట్టి ఖర్చుల చెక్కులను శుక్రవారం కమిషనర్ చాంబర్ నందు అందజేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, విధి నిర్వహణలో మరణించిన కార్మికుల కుటుంబాలకు నగర పాలక సంస్థ అండగా ఉంటుందన్నారు. ఇటీవల ప్రజారోగ్య విభాగంలో అవుట్ సోర్సింగ్ విధానంలో విధులు నిర్వహిస్తున్న బండి భవాని గత అక్టోబర్ లో అనారోగ్య కారణాలతో మరణించగా, నేడు వారి కుటుంబ సభ్యులకు ఎక్స్ గ్రేషియా క్రింద రూ.2 లక్షల చెక్ ను అందించామని, అలాగే ఫిబ్రవరి 18 విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదంలో మరణించిన గొర్రెముచ్చు కొండమ్మ కుటుంబ సభ్యులకు 15 వేల రూపాయల మట్టి ఖర్చుల క్రింద పరిహారం అందించామని తెలిపారు. అలాగే సదరు కార్మికుల కుటుంబాలకు నగర పాలక సంస్థ నుండి అందాల్సిన పరిహారాలు, పి.ఎఫ్. కూడా త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని సంబందిత విభాగాధిపతులను, సూపరిండెంట్లను ఆదేశించామని తెలిపారు. కార్మికులు కూడా తమ సమస్యల పై అర్జీలు లేదా ఫిర్యాదులు తమకు అందిచవచ్చని, వాటిని నిర్దేశిత గడువులోగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Prajavartha Online Telugu News