– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యుత్ సంస్కరణల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ (ఏపి జెన్ కో) ను ప్రైవేటీకరించాలనే ఆలోచనను విరమించుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. ఎపి జెన్‌కోను ప్రైవేటీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేయటం దుర్మార్గం. ప్రైవేటీకరణలో భాగంగా జెన్కోను స్టాక్ మార్కెట్లోకి తీసుకురావాలని, షేర్లను విక్రయించాలని కేంద్రం సూచించినట్లు తెలుస్తోంది. ఇటువంటి ఆలోచనను వెంటనే విరమించుకోవాలి. ఏడాదిన్నర నుంచి ఎపి జెన్కో ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతూ ఉందని, ఉత్పత్తి మరింత మెరుగుపడుతున్న సందర్భంలో ప్రైవేటీకరణకు పాల్పడడం కార్పొరేట్ల లాభాల కోసమేనన్నట్లు గోచరిస్తున్నది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ సంస్కరణల వల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది. విద్యుత్ సంస్కరణలు వేగంగా అమలు చేసేందుకు గతంలో రూ.9,574 కోట్లను రుణాలు తీసుకునేందుకు ఏపీకి కేంద్రం అనుమతి ఇచ్చింది. విద్యుత్‌రంగ సంస్కరణలు వేగవంతం చేసేందుకుగాను దేశంలోని 12 రాష్ట్రాలకు ఆర్థిక ప్రోత్సాహాల పేరుతో కేంద్ర ప్రభుత్వం రూ.66.413 కోట్లు అప్పులు తీసుకునేందుకు పచ్చ జెండా ఊపింది. అదే అదనుగా గత వైసిపి ప్రభుత్వం పరమితికి మించి రుణాలు తీసుకుంది. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల్లు బిగించి, రైతులపై విద్యుత్ భారాలు మోపేందుకు సిద్ధపడుతున్నారు. మరోవైపు విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రభుత్వరంగంలోని విద్యుత్ పంపిణీ సంస్థలను అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పేందుకు చూస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ రంగాలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులను ఇంటికి పంపటమే లక్ష్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరించడం విచారకరం. విద్యుత్ చట్ట సవరణ బిల్లును స్టాండిరగ్ కమిటీ పరిశీలించక ముందే దొడ్డిదారిన విద్యుత్ సంస్థలను సంస్కరణ పేరుతో ప్రైవేటీకరించాలనుకోవడం సరైనది కాదు. విద్యుత్ సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు విద్యుత్ వినియోగదారులు, ప్రజల నడ్డి విరిచేందుకే. రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ విద్యుత్‌రంగ ప్రైవేటీకరణకై కేంద్రం చేస్తున్న కుట్రలను తీవ్రంగా ఖండిస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ సంస్కరణల పేరుతో ఎపి జెన్‌కో ప్రైవేటీకరణ విరమించుకోకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని స్పష్టంచేస్తున్నామన్నారు.
Prajavartha Online Telugu News