Breaking News

రాష్ట్ర బడ్జెట్‌లో ఇళ్ల స్థలాలకు రూ.10వేల కోట్లు కేటాయించాలి…

-ప్రతి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలి.
-3 నెలల్లోగా టిడ్కో ఇళ్లు స్వాధీనపరచాలి.
-విశాఖ ఉక్కు కోసం 14న ఆందోళనలు
-సిపిఐ రాష్ట్ర సమావేశ తీర్మానం
-పేదల ఇళ్ల స్థలాల సమస్యలపై ప్రధాన దృష్టి.
-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ఈనెల 28వ తేదీన ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో పేదల ఇళ్ల స్థలాల కోసం రూ.10వేల కోట్ల బడ్జెట్‌ కేటాయించాలని, ప్రతి ఇంటికీ రూ.5లక్షలు ఇవ్వాలని, టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు మూడు నెలల్లో కేటాయించాలని సీపీఐ సమావేశం తీర్మానించింది. రాష్ట్ర బడ్జెట్‌లో రూ.3లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నప్పుడు..పేదల ఇళ్ల స్థలాల కోసం రూ.10వేల కోట్లు కేటాయించడం సముచితమని అభిప్రాయం వ్యక్తం చేసింది. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా, పట్టణ, నగర కార్యదర్శుల జూమ్‌ మీటింగ్‌ సోమవారం జరిగింది. విజయవాడ చంద్రం బిల్డింగ్‌ నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హాజరవ్వగా, సమావేశానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ అధ్యక్షత వహించారు. జిల్లాల వారీగా పార్టీ కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో సీపీఐ సభ్యత్వం, పేదలకు ఇళ్ల స్థలాలు, భూపోరాటాలు, మార్చి 23 నుంచి ఏప్రిల్‌ వరకు సీపీఐ ప్రచార కార్యక్రమం, రైతు సమస్యలపై ఆందోళన, సీపీఐ శత వార్షికోత్సవాల సందర్భంగా జాతీయ సదస్సు అంశాలపై చర్చించారు. అనంతరం సీపీఐ రామకృష్ణ అజెండాలో పొందుపరిచిన అంశాలను సభ్యులకు వివరించి, వారి నుంచి అభిప్రాయాల్ని స్వీకరించారు.

రామకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పేదల ఇళ్ల స్థలాల కోసం రూ.10వేల కోట్ల బడ్జెట్‌ కేటాయించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇళ్ల స్థలాల సమస్యలపై బాధితుల నుంచి పార్టీలకు అతీతంగా అర్జీల సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, పార్టీ శ్రేణులు పూర్తిగా భాగస్వాములు కావాలని కోరారు. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లోనే ఇళ్ల స్థలాల సమస్యలు అధికంగా వెలుగు చూస్తున్నాయని, దిశగా పార్టీ శ్రేణులు చేపట్టిన అర్జీల సేకరణ ప్రక్రియలో స్పష్టమైందన్నారు. ఇళ్ల స్థలాల సమస్య 90 శాతం పట్టణాల్లోనే తీవ్రంగా ఉందని, సమస్యలున్న చోటకు పార్టీలకు అతీతంగా లబ్దిదారులను చైతన్యవంతుల్ని చేయడం,వారితో అర్జీలు రాయించడం వల్ల మంచి స్పందన వచ్చిందన్నారు. ఇప్పటికే చాలా జిల్లాల్లో లబ్దిదారులతో కలిసి పార్టీ శ్రేణులు కలెక్టరేట్‌కు వెళ్లి వినతులిచ్చారని గుర్తుచేశారు. ఎక్కడైతే పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు పూర్తిగా, ఇంటింటా వెళ్లిన చోటే మంచి స్పందన వచ్చిందన్నారు. అనంతపురంజిల్లా తాడిపర్తి, విశాఖజిల్లాలో లబ్దిఆదారులతో నిరసనలు చేపట్టడం ఇందుకు ఉదాహరణగా రామకృష్ణ చెప్పారు. ఇళ్ల స్థలాల సమస్యలపై శ్రీసత్యసాయిజిల్లాలో మార్చిలో వేలాది మంది బాధితులు అర్జీలతో ఆందోళనకు సిద్ధమయ్యారని తెలిపారు. పేద ప్రజల దగ్గరకెళ్లి వారి ఇళ్ల స్థలాల సమస్యల పరిష్కారానికిగాను, సమీకరించుకునేందుకుగాను ఇది మంచి అవకాశమని, ఇందుకోసం ఇళ్ల స్థలాల సాధన కమిటీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని, ప్రజల సమస్యలే పరిష్కారం దృష్టిగా ముందుకెళ్లాలని కోరారు. ఏఐఎస్‌ఎఫ్‌ మినహా అన్ని ప్రజా సంఘాలు ఇళ్ల స్థలాల సమస్యలపై భాగస్వాములు కావాలని సూచించారు. కార్మిక వర్గాలు, మధ్యతరగతి వర్గాలు ఆర్థిక పోరాటాల రీత్యా మన జెండాలు పట్టుకోవాలని కోరారు. పట్టణాల్లో చాలా చోట్ల అసంఘటిత రంగ కార్మికులున్నారని, వారిలోనూ ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని రామకృష్ణ వివరించారు. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ఇళ్ల స్థలాల సమస్యలపై పూర్తి స్థాయిలో పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు భాగస్వాములు కావాలని, దీని ద్వారా వేలాది మంది బాధితులు తరలివస్తారన్నారు. ఈనెల 28వ తేదీన ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో ఇళ్ల స్థలాలకు కేటాయించిన నిధులపై స్పష్టత వచ్చాక తమ ఉద్యమ కార్యాచరణ రూపొందిద్దామని రామకృష్ణ తెలిపారు.
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరించబోమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టత ఇవ్వడంలేదన్నారు. పదేపదే కేంద్రం ఇచ్చిన నిధులపైనే ఆర్భాటంగా కూటమి నేతలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయకూడదని మార్చి 14వ తేదీన కార్మిక సంఘాల అధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం రౌండ్‌టేబుల్‌ పిలుపునిచ్చిందని, దాన్ని అందరూ విజయవంతం చేయాలని కోరారు. మార్చి 14న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు జరిగే ఆందోళనలో పార్టీతోపాటు ఇతర వామపక్ష నేతలు నేరుగా పాల్గొంటాయని చెప్పారు. సీపీఐ శత వార్షికోత్సవాల సందర్భంగా జాతీయ సదస్సు అంశాలపైనా సమావేశంలో చర్చించారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపైనా దృష్టి కేంద్రీకరించాలని రామకృష్ణ సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *