-జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా పురోగతిలో ఉన్న పనులను వేగవంతం చేసి ఈ మార్చి 5 నాటికి పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని, ఎలాంటి అలసత్వం సహించేది లేదని జూమ్ మీటింగ్ ద్వారా డ్వామా పిడి శ్రీనివాస ప్రసాద్ తో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ నుండి పంచాయతీ రాజ్, డ్వామా అధికారులతో పల్లె పండుగలో భాగంగా మంజూరైన అభివృద్ధి పనుల పురోగతి పై వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన గ్రామ అభివృద్ధి పనులు, సీసీ రోడ్లు పనులు, అనిమల్ షెడ్స్ పై పురోగతి చూపాలని, అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. లక్ష్యం మేరకు ఇంజనీరింగ్ పనులు, సి సి రోడ్ల నిర్మాణం, అనిమల్ షెడ్స్ తదితర పనులను వేగవంతం చేయాలని అన్నారు. అధిక మండలాలు లక్ష్య సాధనలో వెనుకబడి ఉన్నాయని పురోగతి చూయించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డ్వామా పిడి శ్రీనివాస ప్రసాద్, పంచాయితీ రాజ్ ఇంజినీరింగ్ ఈఈ, డిఈ లు, ఏఈ లు, ఎంపిడిఓ లు, ఎ పి ఓ లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News