-జగన్ తుగ్లక్ చర్యల తో విద్యుత్ రంగం సర్వ నాశనం
-దీర్ఘకాలిక ప్రణాళికలతో మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్
-విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వైసీపీ ప్రభుత్వంతో పోల్చితే విద్యుత్ కొనుగోళ్లను 60 శాతం మేర తగ్గించినట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. విద్యుత్ కొనుగోళ్లు, పంపిణీపై అధికారులతో మంత్రి గొట్టిపాటి సచివాలయంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యుత్ రంగానికి సంబంధించి అనేక అంశాలపై మంత్రి చర్చించారు. జగన్ తుగ్లక్ చర్యలతో సంక్షోభంలో కూరుకుపోయిన విద్యుత్ రంగాన్ని గట్టెక్కించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఉన్నతాధికారులకు ఆయన దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డిమాండ్ కు తగ్గ ఉత్పత్తి తో విద్యుత్ కొనుగోళ్ల భారాన్ని 60 శాతానికి తగ్గించినట్లు వివరించారు. ఇటీవల రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసిన జెన్ కో సంస్థ ఉన్నతాధికారులను మంత్రి గొట్టిపాటి ఈ సందర్భంగా అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ తోనే సంక్షోభంలో ఉన్న రాష్ట్ర విద్యుత్ రంగాన్ని అతి కొద్ది నెలల్లోనే పూర్వ వైభవం దిశగా తీసుకెళ్లామన్నారు. దీర్ఘ కాలిక ప్రణాళికలతోనే ఆంధ్రప్రదేశ్ ను మిగులు విద్యుత్ రాష్ట్రంగా నిలుపుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాబోయే వేసవి విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని పారిశ్రామిక, గృహ అవసరాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు ప్రణాళికతో ముందు కెళ్లాలని మంత్రి గొట్టిపాటి అధికారులకు సూచించారు. ప్రతి సంవత్సరం సుమారు 6 శాతం విద్యుత్ వినియోగం పెరుగుతుందని దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. వైసీపీ ప్రభుత్వ చర్యలకు భిన్నంగా వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా చూడాలన్నారు. పునరుత్పాదక విద్యుత్ కూడా అందుబాటులోకి వస్తున్న నేపధ్యంలో విద్యుత్ ఉత్పత్తి పై మరింత దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో ట్రాన్స్ కో జేఎండీ కీర్తి చేకూరి, జాయింట్ సెక్రటరీ కుమార్ రెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News