గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర శివారు ప్రాంతాల అభివృద్ధికి ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రధానంగా మౌలిక వసతులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. మంగళవారం అడవితక్కెల్లపాడు రాజీవ్ గృహకల్ప సముదాయం, స్వర్ణభారతి నగర్, అశోక్ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అడవితక్కెళ్ళపాడు రాజీవ్ గృహకల్ప ప్రాంతాన్ని పరిశీలించి, పారిశుధ్య పనులపై స్థానికుల ఫిర్యాదు మేరకు మెరుగైన చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. త్రాగునీటి సరఫరా, డ్రైన్ల సమస్యలపై ఇంజినీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అశోక్ నగర్ లో పలు అభివృద్ధి పనులను పరిశీలించి, పనులు జరిగే సమయంలో తప్పనిసరిగా ఎమినిటి కార్యదర్శులు అక్కడే ఉండి నిర్దేశిత ప్రమాణాలకు తగిన విధంగా పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చూడాలన్నారు. అనంతరం ఆర్టీఓ కార్యాలయం దగ్గర అన్న క్యాంటీన్ ని పరిశీలించి, క్యాంటీన్ లో త్రాగునీటి సరఫరాపై ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ప్రతి రోజు డిమాండ్ కి అనుగుణంగా ఆహారం అందుబాటులో ఉంచాలని అక్షయపాత్ర ప్రతినిధులను ఆదేశించారు. పర్యటనలో డిఈఈ శ్రీనివాస్, ఆర్ఓ రవికిరణ్ రెడ్డి, ఏసిపి రెహ్మాన్, ఏఈలు, టిపిఎస్ లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News