Breaking News

ప్ర‌త్యేక బృందాల‌తో 149 హాట్‌స్పాట్‌ల‌పై గ‌ట్టి నిఘా పెట్టండి..

– మాద‌క ద్ర‌వ్యాల మూలాల‌పై ఉక్కు పాదం మోపాలి
– విద్యాసంస్థ‌ల్లో క్యాంప‌స్ అంబాసిడ‌ర్ల‌ను గుర్తించి, శిక్ష‌ణ ఇవ్వండి
– యాంటీ నార్కోటిక్ క్ల‌బ్‌ల‌ను క్రియాశీలం చేయాలి
– మాద‌క ద్ర‌వ్య ర‌హిత స‌మాజానికి స‌మ‌ష్టి భాగ‌స్వామ్యం అవ‌స‌రం
– ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మాద‌కద్ర‌వ్య ర‌హిత స‌మాజ నిర్మాణానికి స‌మ‌న్వ‌య శాఖ‌లు, స్వ‌చ్ఛంద సంస్థ‌ల స‌మ‌ష్టి కృషి అవ‌స‌ర‌మ‌ని.. మాద‌క ద్ర‌వ్యాల వినియోగానికి సంబంధించిన 149 హాట్‌స్పాట్‌ల‌పై గ‌ట్టి నిఘా పెట్టాల‌ని, ఈ విష‌యంలో ఈగ‌ల్ బృందాలు కీల‌కంగా ప‌నిచేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు.
నషా ముక్త్‌ భారత్‌ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల నియంత్రణ, దుష్ప్రభావాలు, అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ, కౌన్సెలింగ్ సేవ‌లు త‌దిత‌రాల‌పై మంగళవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధ్య‌క్ష‌త‌న ప్ర‌త్యేక సమావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ మ‌త్తు ప‌దార్థాల వినియోగం వ‌ల్ల క‌లిగే దుష్ప‌రిణామాల‌పై పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల్లో విస్తృత అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని, ఇందుకు విద్యాసంస్థ‌ల్లో క్యాంప‌స్ అంబాసిడ‌ర్ల‌ను గుర్తించి, వారికి అవ‌స‌ర‌మైన శిక్ష‌ణ ఇవ్వాల‌న్నారు. గంజాయి, ఇత‌ర మ‌త్తు ప‌దార్థాలు ఉజ్వ‌ల జీవితాన్ని ఎలా నాశ‌నం చేస్తాయ‌నే విష‌యాల‌ను క్షుణ్నంగా వివ‌రించాల‌న్నారు. మాద‌క ద్ర‌వ్యాల వినియోగం ఒక్క కుటుంబానికే కాదు.. మొత్తం స‌మాజంపై ప్ర‌తికూల ప్ర‌భావం చూపుతుంద‌ని.. ఈ నేప‌థ్యంలో ఉత్ప‌త్తి, ర‌వాణా, వినియోగం.. ఈ మూడు ద‌శ‌ల‌పై స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు ప‌టిష్ట నిఘా పెట్టి జిల్లాలో గంజాయి, మాద‌క ద్ర‌వ్యాల నిర్మూల‌న‌కు కృషిచేయాల‌ని సూచించారు. యువత భవిష్యత్తును నాశనంచేసే మాదకద్రవ్యాల వినియోగాన్ని జిల్లాలో పూర్తిగా అణచివేసేందుకు అధికారులు కృషిచేయాల‌ని.. ప్ర‌ధానంగా మూలాల‌పై ఉక్కుపాదం మోపాల‌న్నారు. జిల్లాలో 10 ఈగ‌ల్ వాహ‌నాలు ఉన్నందున‌, ఈ బృందాల ప్ర‌ణాళికాయుత చ‌ర్య‌ల ద్వారా మంచి ఫ‌లితాలు వ‌చ్చేలా చూడాల‌న్నారు. ప్రతి పాఠశాల, కళాశాలలలో యాంటీ నార్కోటిక్‌ క్లబ్‌లు ఏర్పాటు చేసేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్‌టీఆర్ జిల్లాను మాదకద్రవ్య రహితంగా మార్చేందుకు అధికార యంత్రాంగం చొర‌వ‌కు ప్రజలు, స్వచ్ఛంద సంస్థల సహకారం అవసరమని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ పేర్కొన్నారు.
జిల్లాలో మాద‌క ద్ర‌వ్యాలకు అడ్డుక‌ట్ట వేసేందుకు పోలీస్‌, ఈగ‌ల్ బృందాలు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను డీసీపీ కేజీవీ స‌రిత వివ‌రించారు. 40 యాంటీ నార్కోటిక్స్ స్వ్కాడ్స్‌, డివిజ‌న్ స్థాయిలోని సుర‌క్షా క‌మిటీల ప‌నితీరు, 1972 టోల్‌ఫ్రీ నంబ‌రు సేవ‌లు త‌దిత‌రాల‌తో పాటు నియంత్ర‌ణ చ‌ర్య‌ల్లో డ్రోన్ టెక్నాల‌జీ వినియోగం, నార్కోటిక్ డ్ర‌గ్స్ అండ్ సైకోట్రోపిక్ స‌బ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్‌) చ‌ట్టం ప్ర‌కారం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను ప్ర‌స్తావించారు.
స‌మావేశంలో జిల్లా విభిన్న ప్ర‌తిభావంతులు, టీజీ, వ‌యోవృద్ధుల సంక్షేమ అధికారి వాడ్రేవు కామ‌రాజు, విజ‌య‌వాడ ఆర్‌డీవో కావూరి చైత‌న్య‌, డీఈవో యూవీ సుబ్బారావు, డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, జిల్లా ఇంట‌ర్మీడియెట్ విద్యాధికారి సీఎస్ఎస్ఎన్ రెడ్డి, జిల్లా వ్య‌వ‌సాయ అధికారి డీఎంఎఫ్ విజ‌య‌కుమారి, స్వ‌చ్ఛంద సంస్థ‌ల ప్ర‌తినిధులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *