మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
దోమల వ్యాప్తి, నీటి కాలుష్యం కారణంగా ప్రబలే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని తన చాంబర్లో ఆయన జిల్లాలో సీజనల్ వ్యాధుల వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై వైద్య ఆరోగ్య, మున్సిపల్, గ్రామీణ నీటి సరఫరా, జిల్లా పంచాయతీరాజ్, బీసీ, సాంఘిక సంక్షేమ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సంబంధిత శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. దోమల వ్యాప్తి వల్ల డెంగ్యూ, మలేరియా వంటి విష జ్వరాలు ప్రబలకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, నీటి కాలుష్యంతో వ్యాప్తి చెందే డయేరియా, కలరా వంటి వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.
దీనికోసం ముందుగా డిఎం అండ్ హెచ్ ఓ అధికారితో కూడిన జిల్లాస్థాయి కమిటీ, అదేవిధంగా డిపిఓ, ఆర్డబ్ల్యూఎస్, డీఈవో, ఐసిడిఎస్ పిడి, మున్సిపల్ కమిషనర్లు, వెనుకబడిన తరగతులు, సాంఘిక సంక్షేమ శాఖల అధికారులతో కూడిన మండల, గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి పనిచేయాలని సూచించారు. ఎక్కువ కాలం నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో దోమలు వృద్ధి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని డ్రైనేజీలలో మురుగునీరు సాఫీగా పారే విధంగా పూడికతీత, మరమ్మతులు చేపట్టాలన్నారు. పాత టైర్లు, పారేసిన కొబ్బరి చిప్పలు, మురికి గుంటలు ఉండే చోట్ల నీరు నిల్వ ఉండకుండా శుభ్రం చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని, విధిగా దోమల నివారణకు మందు పిచికారి చేయాలని సూచించారు. లీకైన తాగునీటి పైపులను గుర్తించి మరమ్మతులు చేపట్టాలని, ఓవర్ హెడ్ ట్యాంకులను నిత్యం శుభ్రపరచి క్లోరినేషన్, బ్లీచింగ్ చేయాలని సూచించారు. గ్రామాలలో సచివాలయ ఇంజనీరింగ్ అధికారులతో కలసి ఎమ్ ఎల్ హెచ్ పీ లు నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలని, నీరు కలుషితమైనట్లు గుర్తిస్తే వెంటనే పైఅధికారులకు సమాచారం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
అంగన్వాడీ కేంద్రాలలో కాచి మరిగించిన నీటిని మాత్రమే పిల్లలకు అందించాలని, వాటి పరిసర ప్రాంతాలలో మురుగునీరు నిల్వ ఉండకుండా శుభ్రం చేయాలన్నారు. అదేవిధంగా దోమలు వ్యాప్తి చెందకుండా బీసీ, సాంఘిక సంక్షేమం, రెసిడెన్షియల్ వసతి గృహాల పరిసర ప్రాంతాలలో పరిశుభ్రతకు చర్యలు తీసుకోవాలని, అవసరమైన వసతి గృహాల కిటికీలకు మెష్ లను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో ఎక్కడన్నా డయేరియా వంటి కేసులు నమోదైనట్లు తెలిస్తే తక్షణమే స్పందించి నివారణ చర్యలు చేపట్టాలని, ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. సమావేశంలో డిఎంహెచ్వో డాక్టర్ శర్మిష్ఠ, ఆర్డబ్ల్యూఎస్ అధికారి నటరాజన్, బీసీ వెల్ఫేర్ అధికారి రమేష్, డిపిఓ జే అరుణ, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News