-టీవీ విజయలక్ష్మి డి ఆర్ డి ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్వయం ఉపాధి కొరకై మహిళలకు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్న మానవతా స్వచ్ఛంద సేవా సంస్థను డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ టీవీ విజయలక్ష్మి అభినందించారు. ఈ నెల 8వ తేదీ స్థానిక ఆర్య సమాజం సమావేశ మందిరంలో మానవతా ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకకు టీవీ విజయలక్ష్మి ఆత్మీయ అతిథిగా హాజరై ప్రసంగించారు మహిళలు స్వయం ఉపాధితోనే స్వేచ్ఛను పొందగలరని తద్వారా కుటుంబ సభ్యులు కూడా ఉత్తమ జీవితాన్ని పొందగలరని తెలిపారు. వివిధ విభాగాల ద్వారా మానవతా అందిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని, ప్రజలు స్వచ్ఛందంగా మానవతా సభ్యులుగా చేరి సంస్థను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
ముఖ్య అతిథిగా హాజరైన విశ్రాంత డి ఎం హెచ్ ఓ డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్ మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యం పట్ల దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అందుకు సమతుల్యమైన పౌష్టికాహారం దోహదపడుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా బాలికలకు చిన్న వయసునుండే చక్కటి ఆహారంతో పాటు, ఆరోగ్యాన్ని అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎన్ చాముండేశ్వరి ప్రసంగిస్తూ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో అనేక ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నదని మహిళలు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా ప్రముఖ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనర్ సిహెచ్ జయలక్ష్మి మహిళలకు వాషింగ్ పౌడర్ సెంటర్, ఫినాయిల్, బ్లూ లిక్విడ్, పెయిన్ బామ్ తయారు చేసే విధానాన్ని ఉచితంగా నేర్పించి, ఆపై వారితో స్వయంగా తయారు చేయించారు. శిక్షణ పొందిన మహిళలందరికి ప్రశంస పత్రము బహూకరించబడినది.
కార్యక్రమం అనంతరం 25 రంగాలలో విశిష్ట సేవలు అందిస్తున్న మహిళా మణులను హాజరైన అతిధులు ఘనంగా శాలువా, జ్ఞాపిక, ప్రశంసా పత్రము, పూల మొక్కతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మానవతా చైర్మన్ పావులూరి రమేష్, అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీనివాసరావు, కార్యదర్శి కే సతీష్, కోశాధికారి టీవీ సాయిరాం, గుంటూరు జిల్లా యూత్ సర్వీసెస్ మేనేజర్ రాధిక, ప్రముఖ వ్యాఖ్యాత సుజాత, గురుకుల విద్యాలయాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శాంతి విశాల, మానవతా సభ్యులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News