-కేంద్ర సంస్కృతి ,పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడి
-జాతీయ గ్రంథాలయాల మిషన్ (NML) పథకంపై ప్రశ్నించిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని), ఎంపి దగ్గుమళ్ళ ప్రసాద రావు
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ లో గత మూడేళ్లలో రాజా రామ్మోహన్ రాయ్ గ్రంథాలయ ఫౌండేషన్ (RRRLF) ద్వారా 61 గ్రంథాలయాలు మాత్రమే సహాయం పొందాయి. 2021-22 లో 22 గ్రంథాలయాలు, 2022-23 లో 21 గ్రంథాలయాలు, 2023-24 లో 18 గ్రంథాలయాలు రాజా రామ్మోహన్ రాయ్ గ్రంథాలయ ఫౌండేషన్ (RRRLF) ద్వారా సహాయం పొందినట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ వెల్లడించారు. ఈ మూడేళ్లలో ఈ ఫౌండేషన్ ద్వారా గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఎక్కువ గ్రంథాలయాలు సహాయం పొందినట్లు పేర్కొన్నారు. రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ కి మ్యాచింగ్ (స్టేట్ + సెంట్రల్ ఫండ్), నాన్-మ్యాచింగ్ (సెంట్రల్ ఫండ్ మాత్రమే) పథకాల ద్వారా గ్రంథాలయాలకు ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు.
రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ (ఆర్.ఆర్.ఆర్.ఎల్.ఎఫ్ ), నేషనల్ మిషన్ ఆన్ లైబ్రరీస్ (ఎన్‌ఎంఎల్) పథకం కింద ఆంధ్ర ప్రదేశ్ లో జిల్లాల వారీగా గ్రంథాలయాలకు మంజూరు చేసిన నిధుల వివరాలపై పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లోక్ సభలో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని), చిత్తూరు ఎంపి దగ్గుమళ్ళ ప్రసాద రావు కలిసి అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సోమవారం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏపీ లైజరీ అధారిటీ నుంచి నిధుల మంజూరు కోరుతూ రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ కు ఎలాంటి ప్రతిపాదన రాలేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. గత మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో రెండు గ్రంథాలయాల్లో సెమినార్ నిర్వహణ కోసం, విశాఖపట్నంలో మూడు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఒక గ్రంథాలయాల భవన నిర్మాణ పనుల కోసం, చిత్తూరు జిల్లాలో మరో గ్రంథాలయంలో చిల్డ్రన్ కార్నర్ ఏర్పాటు కోసం ఆర్థిక సాయం అందించినట్లు కేంద్రమంత్రి తెలిపారు.
గత మూడేళ్లలో ఏపీలోని అనంతపూర్, చిత్తూరు, కడప, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణ, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లోని 18 గ్రంథాలయాలకు ఆర్థిక సాయంతో పాటు సెంట్రల్ బుక్ సెలక్షన్ స్కీం కింద పుస్తకాలు సరఫరా చేసినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు.
నేషనల్ మిషన్ ఆన్ లైబ్రరీస్ పథకం కింద ఇప్పటి వరకు లైబ్రరీలలో మౌలిక సదుపాయాలను పెంచడానికి దేశ వ్యాప్తంగా 64 గ్రంధాలయాలకు ఆర్థిక సహాయం విడుదల చేయగా, ఏపీకి సాయం అందలేదని కేంద్రమంత్రి తెలిపారు.
Prajavartha Online Telugu News