-దశాబ్ధాల సమస్యను 10నెలల్లో పరిష్కరించా
-అహర్నిశలు కష్టపడి మంగళగిరి ప్రజల మనసుగెలిచా
-నా మెజారిటీ కంటే వారి ఓట్లు తక్కువ… వారి మాటలను పట్టించుకోను
-కామన్ ఫెసిలిటీ సెంటర్, జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్కుకు ప్రణాళికలు
-త్వరలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన
-రెడ్ బుక్ పేరు వినగానే ఒకరికి గుండెపోటు… మరొకరికి బాత్రూమ్ లో పడి చేయి విరిగింది!
-చట్టాలను ఉల్లంఘించిన వారికే రెడ్ బుక్
-వారి మాదిరిగా ప్రతిపక్షనేత ఇళ్లకు తాళ్లు కట్టడం లేదు… స్వేచ్చగా తిరగనిస్తున్నాం
-పాస్టర్ ప్రవీణ్ మృతి విషయంలో పారదర్శకంగా దర్యాప్తు
-సొంత తల్లి, చెల్లికి న్యాయం చేయని వాడు, ప్రజలను కలవని వాడు మాకు చెబుతాడా?
-ఉండవల్లి విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్
మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
గతంలో మంగళగిరిలో జెసిబి పాలన చూశాం, ఎన్ డిఎ అధికారంలోకి వచ్చాక దశాబ్ధాలుగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారికి ఉచితంగా శాశ్వత పట్టాలు అందించాలని నిర్ణయించాం, ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలోని ఈరోజు ఉండవల్లిలో తొలిపట్టాను అందజేశానని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో గత పదిహేనేళ్లుగా కొండవాలు ప్రాంతంలో నివసిస్తున్న రాజమండ్రి గోవిందు కుటుంబానికి మంత్రి లోకేష్ ఇంటికెళ్లి బట్టలు పెట్టి శాశ్వత పట్టాను అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ…మంగళగిరిలో పాదయాత్ర నిర్వహించిన సమయంలో ఇక్కడ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కీలకమైన హామీ నెరవేర్చా. మంగళగిరి నియోజకవర్గంలో అటవీ, దేవాదాయ, రైల్వే, ఇరిగేషన్ భూముల్లో స్థానిక ప్రజలు దశాబ్ధాలుగా ఇళ్లు నిర్మించుకొని జీవనం సాగిస్తున్నారు. వీరిని వేరే ప్రాంతాలకు పంపితే అక్కడకు వెళ్లి ఇల్లు నిర్మించుకోవడం ఎంతో వ్యయప్రయాసలతో కూడిన పని. వారి కష్టాలు చూశాకే అధికారంలోకి వచ్చాక బట్టలు పెట్టి మరీ శాశ్వత పట్టాలు ఇస్తానని చెప్పాను, ఆ హామీని ఈరోజు నెరవేర్చుతున్నందుకు ఆనందంగా ఉంది. తొలివిడతగా 3వేలమంది శాశ్వత పట్టాలు అందజేస్తున్నాం.
ఘనవిజయంతో నా బాధ్యత పెరిగింది!
2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి తొలిసారి పోటీచేసి 5,300 ఓట్లతేడాతో ఓడిపోయాను. మొదటి రోజు బాధపడ్డా, రెండో రోజునుంచి మంగళగిరి ప్రజల మనసు గెలిచేందుకు ప్రయత్నించా. గత అయిదేళ్లుగా సొంత నిధులతో నియోజకవర్గంలో 26 సంక్షేమ కార్యక్రమాలు అమలుచేశా. ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఉచిత తాగునీటి ట్యాంకర్లు, సొంత డబ్బుతో ఉచితంగా గ్రావెల్ రోడ్ల నిర్మాణం, కరోనా సమయంలో ఆక్సిజన్, టెలీ మెడిసిన్ సేవలు, వైద్యసేవల కోసం ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్య రథాలు, యువత కోసం మంగళగిరి ప్రీమియర్ లీగ్, ప్రతి గ్రామానికి స్పోర్ట్స్ కిట్స్ ఇచ్చాం. మంగళగిరి ప్లేగ్రౌండ్స్ ఏర్పాటుచేశాం. ఎన్నికల ప్రచారంలో 50వేల మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరా. నన్ను గెలిపిస్తే చంద్రబాబు, పవనన్నతో పోరాడి నిధులు తెస్తానని చెప్పా. మంగళగిరి చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో 3వ అతి పెద్ద మెజారిటీ 91వేలతో నన్ను గెలిపించారు. ఈ ఘనవిజయంతో నాలో కసి, బాధ్యత పెరిగింది.
మంగళగిరిలో 50 అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా స్వచ్చ మంగళగిరి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. పార్కులు, ప్లేగ్రౌండ్లు, రైతు బజార్లు అభివృద్ధి చేస్తున్నాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజి, పైప్ లైన్ ద్వారా గ్యాస్ వంటి ప్రాజెక్టులు సిద్ధమవుతున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా శ్మశాన వాటికలు అభివృద్ధి చేస్తున్నాం. మంగళగిరిలో మోడరన్ రైతుబజార్ నిర్మాణం, లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆధునీకరణ, మంగళగిరి ప్రజల కల అయిన వంద పడకల హాస్పటల్ ను దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. త్వరలో వందపడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తాం. స్థానిక సంస్థల నిధులు, సిఎస్ ఆర్ ఫండ్స్ తో గత పదినెలల్లో మంగళగిరి నియోజకవర్గంలో 50 అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం.
మంగళగిరిని టిడిపి కంచుకోటగా మారుస్తా
చేనేతలకు అధునాతన సాంకేతికతపై శిక్షణ, డిజైనింగ్ కోసం కేంద్రప్రభుత్వ సహకారంతో కామన్ ఫెసిలిటీ సెంటర్ ను ఏర్పాటుచేయబోతున్నాం. స్వర్ణకారుల కోసం 75ఎకరాల్లో జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్కు ఏర్పాటుచేసేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది. దీనివల్ల స్థానిక యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకోసం చిత్తశుద్ధితో బాధ్యతగా పనిచేస్తున్నాం. ఎపిలోనే మంగళగిరిని నెం.1గా నిలపాలన్నది మా లక్ష్యం. కుప్పం, హిందూపురం మాదిరి మంగళగిరిని తెలుగుదేశం పార్టీ కంచుకోటగా మారుస్తా. ఇందుకోసం గత పదినెలలుగా అహర్నిశలు కష్టపడుతున్నా. ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న పేద ప్రజల రెండున్నర దశాబ్ధాల కోరికను ఈరోజు నెరవేర్చా. మంగళగిరిని చూశాక రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై వత్తిడి పెరుగుతుంది.
3విడతల్లో అందరికీ శాశ్వత పట్టాలు
ఈరోజు ఉండవల్లిలో రాజమండ్రి గోవిందు కుటుంబానికి ఇచ్చిన పట్టా రిజిస్ట్రేషన్ విలువ రూ.9లక్షలు. మార్కెట్ విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. గతంలో మాదిరి బుల్డోజర్లతో ఇళ్లు కూల్చడం లేదు. పేదల దశాబ్ధాల కల నెరవేరుస్తున్నాం. అటవీ భూముల్లో నివసించే వారికి ఆయాశాఖలతో మాట్లాడి జాగ్రత్తగా సమస్య పరిష్కరించాల్సి ఉంది. ఇందుకు కొంత సమయం పడుతుంది. మంగళగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల్లో నివసించే ప్రజలకు మూడువిడతలుగా శాశ్వత పట్టాలు ఇవ్వాలని నిర్ణయించాం. ప్రస్తుతం 150 గజాల్లోపు ఉంటున్న 3వేలమందికి పట్టాలు ఇస్తున్నాం. 2వవిడతలో ఎండోమెంట్స్, రైల్వే భూముల్లో నివసించేవారికి ఇస్తాం, 3వవిడత మిగిలిన వారందరికీ పట్టాల అందజేతకు చర్యలు తీసుకుంటాం. కాల్వగట్లపై నివసించే వారికి ప్రత్యామ్నాయం కోసం ఆమోదయోగ్యమైన పరిష్కరాన్ని ఆన్వేషిస్తున్నాం. మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్, సిఆర్ డిఎ పరిధిల్లో ఉన్న గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం వేర్వేరు మోడల్స్ సిద్ధం చేస్తున్నాం. మంగళగిరిలో నాపై ప్రత్యర్థుల విమర్శలను పట్టించుకోవాల్సిన పనిలేదు. 2024 ఎన్నికల్లో నాకు వచ్చిన మెజారిటీ కంటే వారికి వచ్చిన ఓట్లు తక్కువ. కష్టపడి పనిచేసి మంగళగిరి ప్రజల మనసు గెలిచానని మంత్రి లోకేష్ చెప్పారు.
ఉండవల్లి విలేకరుల సమావేశంలో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్
రెడ్ బుక్ పేరు చెప్పగానే వైసిపి నాయకులు బెంబేలెత్తుతున్నారు, ఇప్పటికే ఒకరికి గుండెపోటు వచ్చింది, మరొకరు బాత్రూమ్ లో పడి చేయి విరిగింది. చట్టాలు ఉల్లంఘించిన వారికే రెడ్ బుక్ వర్తిస్తుందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టంచేశారు. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో నిరుపేద కుటుంబానికి శాశ్వత పట్టా అందించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… గత ప్రభుత్వం రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలచేసింది. మేము అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాం. మేము ప్రతిపక్షనేత ఇంటిగేటుకు తాళ్లు కట్టలేదు, తప్పుడు కేసులు బనాయించడం లేదు. డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువగా జగన్ కు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చాం. ఆయన స్వేచ్చగా ప్రజల్లోకి వెళ్లే అవకాశం కల్పిస్తున్నాం. వారు తప్పుడు ప్రచారం చేస్తే ఎలా తిప్పికొట్టాలో మాకు తెలుసు.
తప్పుడు ప్రచారం చేస్తున్నందుకే రెడ్ బుక్ పేరు చెప్పా
కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో 35వేలమంది ప్రజలు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు పొట్టచేతబట్టుకొని వలసలు వెళ్లారు. యువగళం పాదయాత్ర సమయంలో అక్కడ వలసలను నివారిస్తానని హామీ ఇచ్చా. ఆ మాటమేరకు కనిగిరిలో తొలి రిలయన్స్ సిబిజి ప్లాంటు ఏర్పాటుచేశాం. అక్కడ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి 50వేల ఎకరాల భూములు ఇచ్చేందుకు తమ రైతులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. దానిపై రిలయన్స్ డైరక్టర్ స్పందించి 50ప్లాంట్లు అక్కడే ఏర్పాటుచేస్తామని అన్నారు. కరువు ప్రాంతంలో పెద్దఎత్తున యువతకు ఉపాధి కల్పించేందుకు ఇటువంటి ప్రాజెక్టులు తెస్తుంటే వైసిపి వారికి కడుపుమంట దేనికి? బొబ్బలు వస్తాయంటూ దానిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ దుష్ర్పచారానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకే అటువంటి వారిని రెడ్ బుక్ లోకి ఎక్కిస్తానని చెప్పా.
జగన్ కు సొంతవాళ్లను కలిసేందుకే తీరికలేదు
సొంత చెల్లి, తల్లికి న్యాయం చేయలేని వారు మాకు చెబుతారా? ప్రిజనరీ ఆలోచనలన్నీ జైలువైపే ఉంటాయి. తప్పుచేశారు కనుక ఆయన ధైర్యంగా ప్రజల్లో తిరగలేకపోతున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎవరినీ కలవలేదు, ప్రతిపక్షంలోకి వెళ్ళిన తరువాత కూడా కనీసం కార్యకర్తలను కలిసే సమయం జగన్ కు లేదు. ప్రజలను కలిసే ఓపిక ఆయనకు ఎక్కుడుంది? ప్రజాసమస్యలపై చిత్తశుద్ధి ఉంటే అయిదేళ్లు ఆయన నివసించే ప్రాంతంలో ప్రజల సమస్యలను ఎందుకు పరిష్కరించలేదు? పైగా ఆయన ఇంటిదారి కోసం పేదోళ్ల ఇళ్లను కూల్చారు. పేదలకు అండగా నిలిచే ప్రజాప్రభుత్వం మాది. మాతో అభివృద్ధి, సంక్షేమంలో పోటీపడలేక కులం, మతం, ప్రాంతం పేరుతో విద్వేషాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ మరణం విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో మా ప్రభుత్వం పారదర్శకంగా దర్యాప్తు చేస్తోంది. తప్పుచేసిన వారు ఎవరైనా వదిలే ప్రసక్తిలేదు.
విజనరీ – ప్రిజనరీకి ఎంతో తేడా ఉంది!
విజనరీ లీడర్ కు – ప్రిజనరీకి ఎంతో తేడా ఉంది. ప్రపంచంలో వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా మనబిడ్డలను సిద్ధం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. 1994లో చంద్రబాబు తొలిసారి సిఎం అయినప్పుడు కొందరు ప్రత్యర్థులు కంప్యూటర్లు అన్నం పెడతాయా అంటూ అవహేళన చేశారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఐటి ఎన్నిలక్షలమంది యువత ఉద్యోగాలు చేస్తున్నారో కళ్లముందు కన్పిస్తోంది. చంద్రబాబునాయుడు ఎంతో ముందుచూపుతో ఆలోచించి ఐటి టవర్, ఐఎస్ బి, జీనోమ్ వ్యాలీ, అవుటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వంటివాటిని అభివృద్ధి చేశారు. ఫలితంగా ఈరోజు హైదరాబాద్ అంతర్జాతీయస్థాయి నగరంగా తయారైంది. విభజిత ఆంధ్రప్రదేశ్ ను అదేస్థాయిలో అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు అవిశ్రాంతంగా కృషిచేస్తున్నారు. నిరుపేదలను పేదరికం నుంచి శాశ్వతంగా బయటకు తేవాలన్న లక్ష్యంతో పి4 విధానానికి రూపకల్పన చేసి, ఇటీవల ప్రారంభించారు.
రైతులకు న్యాయం చేసే బాధ్యత మాది
రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధరల విషయంలో మా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. వరికి సంబంధించి గత ప్రభుత్వ బకాయిలను చెల్లించడమేగాక కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొన్న ధాన్యానికి ఎప్పటికప్పుడే డబ్బు రైతుల ఖాతాల్లో జమచేస్తున్నాం. తక్కువ ధర పలికే కొన్నిరకాల మిర్చి కనీస మద్ధతుధర రూ.11,500 అందజేస్తున్నాం. పసుపు ధరలకు సంబంధించి నేను దృష్టిసారించా. గిట్టుబాటు ధరలపై అచ్చంనాయుడు, నాదెండ్ల మనోహర్ లతో కూడిన కమిటీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. రైతు నష్టపోకుండా చూసుకునే బాధ్యత మా ప్రభుత్వానిది. కొన్నిరకాల పంటల ఎక్కువగా వచ్చినపుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ తో ధరలను స్థిరీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి లోకేష్ చెప్పారు.
కార్యక్రమంలో ఏపీ ఎంఎస్ఐడీసీ చైర్మన్ చిలపల్లి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు మెంబరు తమ్మిశెట్టి జానకీ దేవి, కూటమి నాయకులు, స్థానిక పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News