-బాధిత విద్యార్థిని కుటుంబానికి కూటమి ప్రభుత్వ అండగా ఉంటుంది
-ఆత్మహత్యకు కారకుడిపై చట్ట ప్రకారం చర్యలుంటాయి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమండ్రిలో ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి ఆత్మహత్య దురదృష్టకరం. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఆ కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. కిమ్స్ ఆసుపత్రిలో ఇంటర్న్ గా ఉన్న నాగాంజలి తన సూసైడ్ నోట్ లో కారకుడిగా పేర్కొన్న ఆసుపత్రి ఏజీఎం డా.దువ్వాడ దీపక్ ను ఇప్పటికే అరెస్టు చేసినట్లు పోలీసులు తెలియచేశారు. కచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. విద్యార్థినులు, యువతుల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకొంటుంది. ఇటువంటి ఘటనలు చోటు చేసుకొన్నప్పుడు పోలీసు శాఖ కూడా మరింత పకడ్బందీగా చర్యలు చేపట్టడంతోపాటు బాధిత వర్గం ఆవేదనను, భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకోవాలి. తోటి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడితే విద్యార్థులు ఆందోళనకు లోనవుతారు. కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో చోటు చేసుకున్న అత్యాచార, హత్య ఘటన సమయంలో మెడికోలు ఆందోళనలు చేయడాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. విద్యార్థులకు, యువతులకు భరోసా, ధైర్యం కల్పించాల్సిన బాధ్యత పోలీసులు తీసుకోవాలి. రాజమండ్రి ఘటన నేపథ్యంలో అనుసరించాల్సిన జాగ్రత్తలు, చర్యల గురించి హోమ్ శాఖ మంత్రి అనిత కీ, రాష్ట్ర డీజీపీ కీ తెలియచేస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటనలో తెలిపారు.
Prajavartha Online Telugu News