-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో అక్షర జ్యోతిని వెలిగించిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే అని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. పూలే జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనము నందు డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజా రెడ్డితో కలిసి ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి శుక్రవారం ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి మహాత్మ పూలే అందించిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం పాటుబడిన దీనజన బాంధవుడు జ్యోతిరావు పూలే అని కీర్తించారు. 19వ శతాబ్ధపు గొప్ప సంఘసంస్కర్తలలో అగ్రగణ్యులని.. సామాజిక సమానత్వం కోసం యుద్ధం చేసిన వైతాళికుడని కొనియాడారు. కులవివక్షని ప్రత్యక్షంగా అనుభవించిన ఆయన దానిని రూపుమాపేందుకు తుది శ్వాస వరకు కృషి చేశారన్నారు. బాల్యవివాహాలు, మూఢనమ్మకాలు, సతీ సహగమనానికి వ్యతిరేకంగా బలమైన ఉద్యమాన్ని నడిపారన్నారు. ఆయన రచనలు, ఉపన్యాసాలు ప్రత్యక్ష అనుభవాలతో నిండి ఉండేవన్నారు. దళిత, బహుజన వర్గాల అభ్యున్నతి కోసం పూలే ఆచరించిన కార్యాచరణ మహోన్నతమైనదని మల్లాది విష్ణు పేర్కొన్నారు. స్త్రీలకు విద్యను అందించడం కోసం తన భార్య సావిత్రీబాయికి చదువు చెప్పి ఉపాధ్యాయురాలిగా మలిచిన మేధావి అని కొనియాడారు. కనుకనే పూలేను భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తన గురువుగా ప్రకటించుకున్నారన్నారు. విద్యతోనే సామాజిక ఆర్ధిక సమున్నతికి బాటలు పడతాయన్న మహాత్మా పూలే ఆలోచన విధానమే మనందరికి స్ఫూర్తి అని చెప్పారు. పూలే ఆశయాల సాధనకు ప్రతిఒక్కరూ కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు యరగొర్ల శ్రీరాములు, అలంపూర్ విజయ్, ఇసరపు రాజారమేష్, మేడా రమేష్, తోపుల వరలక్ష్మి, శ్యామ్, యర్రంశెట్టి అంజిబాబు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News