-అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి
-ఏడాది లోపు అద్దంకిలో లైబ్రరీని ఏర్పాటుకు హామీ ఇచ్చిన మంత్రి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అద్దంకి: భారతీయులకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందించిన అతిపెద్ద ఆస్తి రాజ్యాంగమే అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. సోమవారం నాడు అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటించారు. నియోజకవర్గంలోని నంబూరువారిపాలెంలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. స్థానికంగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి గొట్టిపాటి రవి కుమార్… సమాజంలో ఉన్న అసమానతలను తొలగించే శక్తి కేవలం ఒక్క చదువుకు మాత్రమే ఉందని అన్నారు. దీనిని గుర్తించిన డా. బీఆర్ అంబేద్కర్ లండన్ యూనివర్సిటీల్లో పెద్ద చదువులు చదివి దేశం గర్వించే స్థాయికి ఎదిగారని అన్నారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, హక్కుల సాధనకు చేసిన అంబేద్కర్ ఎంతో కృషి చేశారని మంత్రి గొట్టిపాటి ఈ సందర్భంగా కొనియాడారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో కీలకపాత్ర పోషించారని, ఆయన కృషి కారణంగానే భారతదేశం బలమైన ప్రజాస్వామ్యం దేశంగా నిలిచిందని పేర్కొన్నారు. అంబేద్కర్ చదువుకు పెద్దపీట వేసినట్లు తెలిపిన మంత్రి గొట్టిపాటి రవి కుమార్… వచ్చే ఏడాది కల్లా అద్దంకి నియోజకవర్గంలో అంబేద్కర్ పేరిట లైబ్రరీ ఏర్పాటు చేయనున్నట్లు హామీ ఇచ్చారు. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం నేడు ఎన్నో దేశాల వారికి మార్గదర్శిగా ఉందని మంత్రి గొట్టిపాటి వివరించారు. దేశం గర్వించదగ్గ నాయకుల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఒకరిని మంత్రి గొట్టిపాటి తెలిపారు. జాతీయ నాయకుడైన డా. బీఆర్ అంబేద్కర్ ను ఏ కులానికో, మతానికో ఆపాదించడం సరికాదని అన్నారు. ఆయన అనుసరించిన మార్గాన్ని ప్రతీ ఒక్కరూ అనుసరించి అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News