-నాటక రంగ ప్రోత్సాహానికి నిదర్శనంగా రాష్ట్రస్థాయిలో ముగ్గురికి, జిల్లా స్థాయిలో 107 మందికి మొత్తంగా 110 మంది ప్రతిభ గల నాటక రంగ కళాకారులు, సాంకేతిక నిపుణులకు కందుకూరి పురస్కారాలు
-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ మరియు నాటక రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో పురస్కారాల ప్రదానం
-నాటక, సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ చైర్మన్‌గా 11 మంది సభ్యులతో ఏర్పాటైన కమిటీ ఆధ్వర్యంలో పురస్కారాల ఎంపిక
-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏప్రిల్ 16వ తేదీన ప్రముఖ రచయిత, సంఘ సంస్కర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి కందుకూరి వీరేశలింగం పంతులు గారి 177వ జయంతిని పురస్కరించుకొని నిర్వహించుకునే తెలుగు నాటక రంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయిలో ముగ్గురికి కందుకూరి ప్రతిష్టాత్మక రంగస్థల పురస్కారం మరియు 26 జిల్లాలకు గానూ జిల్లా స్థాయిలో 107 మంది ప్రతిభ గల నాటక రంగ కళాకారులు, సాంకేతిక నిపుణులకు కందుకూరి విశిష్ట పురస్కారాలను అందిస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాటక, సినీ రచయిత డా||బుర్రా సాయి మాధవ్ ఛైర్మన్ గా 11 మంది నాటక రంగ ప్రముఖులతో నియమించిన ఎంపిక కమిటీ ఈ మేరకు పురస్కార గ్రహీతలను పారదర్శకంగా ఎంపిక చేసిందన్నారు. నాటక రంగంలో కృషి చేసిన వారికి రాష్ట్రస్థాయిలో కందుకూరి ప్రతిష్ఠాత్మక రంగస్థల పురస్కారంతో పాటు లక్ష రూపాయల నగదు, జిల్లా స్థాయిలో ఎంపికైన వారికి కందుకూరి విశిష్ట పురస్కారంతో పాటు రూ. 10 వేల నగదును ఏప్రిల్ 16న సాయంత్రం 6 గం.లకు విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో అందించనున్నామన్నారు. కళా, నాటక రంగాలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ మరియు నాటక రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించామని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ ప్రకటనలో పేర్కొన్నారు. కళాకారులు, నాటకరంగ ప్రముఖులు, సాంకేతిక నిపుణులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే అని వెల్లడించారు.
Prajavartha Online Telugu News