-సాక్షిలో విద్యుత్ బిల్లులు పెరిగినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారు
-వైసీపీ పెంచిన విద్యుత్ ఛార్జీలే ప్రజలపై పెనుభారంగా మారాయి
-కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎలాంటి చార్జీలు పెంచలేదు
-ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్
పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచలేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు విద్యుత్ చార్జీలను తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది గాని, విద్యుత్ ఛార్జీలను పెంచే ప్రసక్తి లేదని పేర్కొన్నారు. వైసీపీ అధికారిక పత్రిక సాక్షి కూటమి ప్రభుత్వం పై బురద జల్లే విధంగా విద్యుత్ చార్జీల విషయంలో అసత్య ప్రచారం చేస్తుందని మంత్రి గొట్టిపాటి మండిపడ్డారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెంచిన విద్యుత్ చార్జీలనే ప్రజలు నేటికీ పెను భారంగా మోస్తున్నారని మంత్రి వివరించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం లోని ఉయ్యూరులోని టిడ్కో గృహ సముదాయంలో కొత్తగా ఏర్పాటు చేసిన 33 /11 కెవి సబ్ స్టేషన్ ను మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తో పాటు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ రాష్ట్ర ప్రజానీకానికి నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు కొత్త సబ్ స్టేషన్ లను అందుబాటులోకి తీసుకొని వస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో పారిశ్రామిక అవసరాలకు, పోర్ట్ పనులకు అనుకూలంగా విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ శాఖ తగు చర్యలను తీసుకుంటుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో 132 కెవి సబ్ స్టేషన్ ను నిర్మించేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేసి పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఇవ్వాలని మంత్రి గొట్టిపాటి అధికారులను ఆదేశించారు. పీఎం సూర్య ఘర్, పీఎం కుసుమ్ పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేలా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆదేశించారు. ఈ రెండు పథకాలను సమర్థవంతంగా వినియోగించుకుంటే అన్నదాతలకు పగటిపూటే నిరంతరాయ విద్యుత్ అందించే అవకాశం ఉంటుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. పీఎం సూర్య ఘర్ ద్వారా విద్యుత్ వినియోగదారులు విద్యుత్ చార్జీలను తగ్గించుకోవడంతో పాటు వినియోగదారుడే, ఉత్పత్తిదారునిగా మారవచ్చని మంత్రి గొట్టిపాటి పిలుపునిచ్చారు.
గత ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసిందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. కొంతమంది వైసిపి నాయకులు పనిగట్టుకుని మరి ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పినా కానీ ఆ పార్టీ నాయకుల తీరు మారలేదని మంత్రి గొట్టిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సామాజిక భద్రత పెన్షన్లను పంపిణీ చేస్తుంటే, ఉన్న పెన్షన్లను తొలగిస్తున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని స్పష్టం చేశారు.
గ్రీన్ ఎనర్జీకి ఆంధ్రప్రదేశ్ అనుకూల ప్రాంతమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ గ్రీన్ ఎనర్జీలో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో ఉంచితే, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడిదారులను భయపెట్టి రాష్ట్రం నుంచి తరిమేసినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ వివరించారు. అయితే కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడిదారుల్లో విశ్వాసం నింపి పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి రాయలసీమ తర్వాత ప్రకాశం జిల్లా అత్యంత అందమైన ప్రదేశంగా మారిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు.
Prajavartha Online Telugu News