విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
“సెకి అదానీ ఒప్పందం -నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి’ అనే అంశంపై సెంటర్ ఫర్ లిబర్టీ (సిఎఫ్ఎల్) ఆధ్వర్యాన విజయవాడలోని బాలోత్సవ భవన్ లో గురువారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి సిఎఫ్ఎల్ చైర్మన్ ఎన్ చక్రవర్తి అధ్యక్షత వహించారు. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు, ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి సంస్థల మధ్య జరిగిన అన్ని విద్యుత్ కొనుగోళ్లు ఒప్పందాలు (పిపిఎ), సరఫరా ఒప్పందాలు(పిఎస్ఎ) పై సుప్రీంకోర్టు, లేదా హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యాన జ్యుడీషియల్ కమిటీ వేసి లోతైన దర్యాప్తు జరపాలని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకి) అదానీ -విద్యుత్ పంపిణీ సంస్థల మధ్య జరిగిన ఒప్పందంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, సీనియర్ ఐపిఎస్ అధికారితో పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్టి పరిస్థితుల్లో ఐదేళ్లకు మించి మెగా విద్యుత్ ఒప్పందాలు చేసుకోకూడదని తెలిపారు. ఐదేళ్ల తరువాత భవిష్యత్ తరాలపై ప్రభావం చూపే అన్ని ప్రభుత్వ నిర్ణయాలపై ఏకాభిప్రాయం సాధించాలని, ప్రజాక్షేత్రంలో విస్తృత చర్చ జరిగిన తరువాతే ముందుకెళ్లాలని కోరారు. ప్రతిపక్షంలో ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత తప్పించుకుంటోందన్నారు. ఒప్పందం రద్దు వల్ల పెట్టుబడిదారుల్లో నమ్మకం పోతుందని చెబుతూ ప్రజలపై భారాలు మోపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధమవడం సరికాదన్నారు.
రిటైర్డ్ ఐఎఎస్ అధికారి పివి రమేష్ మాట్లాడుతూ సెకి అవినీతిపై నిగ్గు తేల్చేందుకు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఉత్పత్తిల్లో ప్రభుత్వ పెట్టుబడి తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల పంపిణీ సంస్థలు నష్టాల ఊబిలో కూరుకుపోయాయని చెప్పారు. ప్రస్తుతం లాభాల్లో ఉన్న ట్రాన్స్మిషన్ వ్యవస్థను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఐపిఎస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాజకీయ నాయకులు, అధికారులు అవినీతి చేస్తూ ప్రజలపై విపరీతమైన భారాలు మోపుతున్నారని అన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులను వికేంద్రీకరణ చేయాలని, రైతులే వీటిని ఏర్పాటు చేసుకునేలా ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొలను కొండ శివాజి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు, సిపిఐ నాయకులు రవీంద్రనాథ్, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి రమాదేవి, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకులు హరినాథ్, బిఎస్పి నాయకులు పుష్పరాజ్, జన చైతన్యవేదిక నాయకులు లక్ష్మణరెడ్డి, పౌరసంఘం నాయకులు లక్ష్మీనారాయణ, ఖాన్ యదాని, భవాని ప్రసాద్, ఒపిడిఆర్ నాయకులు భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News