-గ్రామ ఉద్యాన సహాయకుల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాబ్‌చార్ట్ ప్రకారమే గ్రామ ఉద్యాన సహాయకులు విధులు నిర్వహించేలా చూడాలని కోరుతూ గ్రామ ఉద్యాన సహాయకుల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్వర్యంలో విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం సదస్సు జరిగింది.
ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాణోతు నాగరాజు మాట్లాడుతూ పదోన్నతుల కోసం గ్రామ ఉద్యాన సహాయకులు చదువుకోవడానికి అవకాశం కల్పించాలని కోరారు. ఈ మేరకు గతంలో మంత్రి అచ్చెన్నాయుడు, ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేశామన్నారు. అయినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన రాలేదన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఉద్యమ కార్యాచరణ తప్పదని హెచ్చరించారు. గ్రామ ఉద్యాన సహాయకులను ఉద్యానశాఖ పనులు చేసుకునే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ ప్రభుత్వాన్ని మాట్లాడుతూ గ్రామ ఉద్యాన సహాయకులను సచివాలయాల్లో పనిచేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. గ్రామ ఉద్యాన సహాయకులను ఉద్యాన పంటల విస్తీర్ణం ప్రాతిపదికన ఉద్యాన అధికారి పర్యవేక్షణలో విధులు నిర్వహించేలా మ్యాపింగ్ చేయాలని, ఆరేళ్లుగా ఉద్యాన సహాయకులకు బదిలీలు, పదోన్నతులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. చాలామంది ఉద్యోగులు డిప్లొమా, జనరల్ డిగ్రీ, బీఎస్సీ హార్టికల్చర్, ఎమ్మెస్సీ హార్టికల్చర్ చదువుకున్నారన్నారు. అనంతరం సభ్యులు తమ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీర్మానాలు, భవిష్యత్ కార్యాచరణ చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు సురేంద్ర, మురళీ, చంద్రయ్య, ఆంజనేయులు, దుర్గా ప్రసాద్, సుబ్రమణ్యం, దీక్ష, షమీమ్, భరత్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News