-జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో మే 4న నీట్ యూజీ- 2025 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవిన్యూ అధికారి జి నరసింహులు సంబందిత అధికారులకు సూచించారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫిరెన్స్ హాలు లో నీట్ యూజీ- 2025 పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లపై కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ నీట్ సిటీ కోఆర్డినేటర్ హేమంత్ పాండ్య, జిల్లా అడిషనల్ ఎస్పీ రవిమనోహరాచారి లతో కలసి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా రెవిన్యూ అధికారి జి నరసింహులు మాట్లాడుతూ… జిల్లాలో మొత్తం పది ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో గూడూరు నందు ఒక పరీక్ష కేంద్రం, తిరుపతి జిల్లా కేంద్రంలో తొమ్మిది పరీక్ష కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ఈ పరీక్షల్లో మొత్తం 4489 మంది విద్యార్థులు హాజరవుతారని ఆయన తెలిపారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఆఫ్ లైన్లో విధానంలో జరుగుతుందని చెప్పారు. ఉదయం 11 గంటల నుంచి విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించి కట్టుదిట్ట భద్రత ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ వారిని ఆదేశించారు. కస్టోడియన్ బ్యాంకుకు వచ్చిన పరీక్ష పేపర్లను సూపరింటెండెంట్లు, పోలీసు సహకారంతో తీసుకురావాలని సూచించారు. పోలీసు సిబ్బంది పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులు ఆదేశించారు. దివ్యాంగ విద్యార్థులకు పరీక్ష కేంద్రంలో వీల్ చైర్లను, సహాయకులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
నీట్ యూజీ నియమ నిబంధనలను తప్పక పాటించాలని అధికారులను ఆదేశించారు. పరీక్షలకు హాజరగు అభ్యర్దులు సెల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతి లేవని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు మౌలిక వసతులైన టాయిలెట్స్, త్రాగునీరు ఉండేలా చూసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాలకు హాజరయ్యే విద్యార్థినీ, విద్యార్థులకు ఆర్.టి.సి బస్సులను ఉదయము మరియు సాయంత్రం సమయాలలో అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో వైద్య సిబ్బంది తో పాటు, 108 వాహనాన్ని అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద జనం గుమి కూడకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. పరీక్ష జరుగు కేంద్ర సమీపంలో ఎక్కడ కూడా జిరాక్స్ కేంద్రాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.
తిరుపతి నగర పరిధిలో తొమ్మిది పరీక్ష కేంద్రాలు :
1. శ్రీ పద్మావతి గర్ల్స్ హై స్కూల్, వెస్ట్ చర్చి రోడ్, బాలాజీ కాలనీ, తిరుపతి. 2. పీఎం కేంద్రీయ విద్యాలయ నెంబర్ 1, తిరుపతి, హరే కృష్ణ రోడ్, యం సి ఆర్ కాలనీ, తిరుపతి
3. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (ఉమెన్స్ యూనివర్సిటీ) శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం,
ఎగ్జామినేషన్ హాల్, పద్మావతి నగర్, తిరుపతి
4. ఎస్.జి.ఎస్ ఆర్ట్స్ కాలేజ్ (ఆటానమస్) నియర్ లక్ష్మీపురం సర్కిల్ తిరుచానూర్ రోడ్, తిరుపతి
5. శ్రీ పద్మావతి ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ (టీటీడీ) వింగ్ -ఏ, ఎస్ వి యూనివర్సిటీ నియర్ శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్ తిరుపతి
6. శ్రీ పద్మావతి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ అండ్ పీజీ కాలేజ్ (టిటిడి) వింగ్ – బి, ఎస్ వి యూనివర్సిటీ పద్మావతి గెస్ట్ హౌస్ తిరుపతి
7. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ క్యాంపస్ హై స్కూల్, వెస్ట్ చర్చి రోడ్డు, బాలాజీ కాలనీ తిరుపతి
8. శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్ (టిటిడి) నియర్ సంస్కృత విద్యాపీఠం, ఎల్ఐసి రోడ్, బాలాజీ కాలనీ తిరుపతి
9. ఎస్ వి ఆర్ట్స్ కాలేజ్ (టిటిడి) వింగ్ ఏ, ఎస్ వి ఆర్ట్స్ కాలేజ్ (టీటీడీ) వింగ్ – ఏ, బాలాజీ కాలనీ తిరుపతి
10. డి ఆర్ డబ్ల్యు జూనియర్ కాలేజ్, గూడూర్, జడ్పీ హైస్కూల్ రోడ్, గూడూరు.
ఈ సమావేశంలో వైద్య శాఖ అధికారి, విద్యుత్ శాఖ అధికారి, చీఫ్ సూపరింటెండెంట్స్,విద్యా శాఖాదికారులు, నీట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News