-రూ. 150 కోట్ల పెట్టుబడికి ఆర్వెన్సిస్ గ్రూప్ ఆసక్తి
-ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటితో ఆస్ట్రేలియా ప్రతినిధుల బృందం భేటీ
తాడేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆస్ట్రేలియాకు చెందిన ఆర్వెన్సిస్ గ్రూప్ రాష్ట్రంలో కంప్రెస్డ్ బయో గ్యాస్ యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు తాడేపల్లిలో ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తో ఆ సంస్థ ప్రతినిధులు గురువారం భేటీ అయ్యి చర్చించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఉన్న విస్తృత అవకాశాలను మంత్రి ఆర్వెన్సిస్ గ్రూప్ సంస్థ ప్రతినిధులకు వివరించారు. ప్రభుత్వం వైపు నుంచి పెట్టుబడిదారులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి గొట్టిపాటి హామీ ఇచ్చారు. దీనిపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆర్వెన్సిస్ ప్రతినిధులు రాష్ట్రంలో తొలుత ఒక సీబీజీ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 12 – 20 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ప్లాంట్ ను సుమారు రూ. 150 కోట్ల పెట్టుబడితో నెలకొల్పుతామని మంత్రికి వివరించారు.
పునరుత్పాదక విద్యుత్ రంగంలో ప్రాజెక్టుల ఏర్పాటుకు సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు మంజూరు చేస్తామని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు. ఆర్వెన్సిస్ సీబీజీ ప్లాంట్ ఏర్పాటుతో యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన ఆర్వెన్సిస్ గ్రూప్ ప్రతినిధులను మంత్రి గొట్టిపాటి అభినందించారు.
Prajavartha Online Telugu News