-నగరాన్ని టూరిజం హబ్ గా మార్చడమే లక్ష్యం: కమిషనర్ కేతన్ గార్గ్
-రానున్న రోజుల్లో రూ.220 కోట్ల తో పలు అభివృద్ధి పనులు
-రాజమహేంద్రవరం చరిత్రలో రిఫర్ ఫ్రంట్ అభివృద్ధి ఓ మైలురాయి: ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పుష్కర పనుల్లో భాగంగా రాజమహేంద్రవరం నగరాన్ని అత్యంత సుందరమైన నగరంగా తీర్చిదిద్దనున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. రూ. 8 కోట్ల నిధులతో రివర్ ఫ్రంట్ అప్పర్ ప్రామినేడ్ అభివృద్ధి పనులకు గోదావరి గట్టున ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బుధవారం శంకుస్థాపన నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సభాధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నగర కమిషర్ కేతన్ గర్గ్, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, ఎమ్మెల్సీ సోమువీర్రాజు, రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. తొలుత శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గ్యాలరీలో నమూనా ఫోటోలను తిలకించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ.. గోదావరి నదీ తీరంలో ఉన్న రాజమహేంద్రవరం నగరాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. ప్రస్తుత నగర జనాభా 5 లక్షలు కాగా.. పుష్కర సమయంలో రోజూ 10 లక్షల మంది ఈ ప్రాంతానికి వస్తారనే అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. గత పుష్కరాల సమయంలో కేవలం పుష్కర ఘాట్లను మాత్రమే అభివృద్ధి చేసుకున్నామని.. కానీ ఈ పుష్కరాలు పూర్తి భిన్నంగా ఉండబోతున్నాయన్నారు. వచ్చే భక్తులకు పూర్తిస్థాయి సౌకర్యాల కల్పించడంతో పాటు నగర సౌందర్యాన్ని కూడా చూపబోతున్నట్లు కలెక్టర్ చెప్పారు. రాజమహేంద్రవరం అభివృద్ధిపై అధికార యంత్రాంగంతో పాటు ఇటు ప్రజాప్రతినిధులు కూడా నిత్యం దృష్టి సారిస్తున్నారని.. కనుక 2027 పుష్కరాల నాటికి నగరం మరింత అందంగా, ప్రజలకు సౌకర్యవంతంగా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. అలాగే అఖండ గోదావరి ప్రాజెక్టు కింద కేంద్ర పర్యాటక శాఖ ద్వారా రూ. 100 కోట్ల నిధులు మంజూరు అయినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ నిధులలో రూ. 97 కోట్లు ఒక్క రాజమండ్రి నగరానికే కేటాయించగా.. పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని వెల్లడించారు. అలాగే రానున్న 6 నెలల కాలంలో నగరంలో 22 పార్కులను పూర్తిస్థాయిలో అభివృద్ధి పరిచి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఓవైపు అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నప్పటికీ.. వాటిని పరిరక్షించవలసిన బాధ్యత నగర పౌరులదేనని కలెక్టర్ అన్నారు. రోడ్లు, పార్కులు నిరంతరం పరిశుభ్రంగా ఉంచడంలో పౌరుల బాధ్యత కీలకమన్నారు. ప్రజలు తమ సహాయ సహకారాలు అందిస్తే 2027 పుష్కరాల నాటికి రాజమహేంద్రవరాన్ని ఇండోర్ నగరానికి మించి సుందర నగరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీ సోమువీర్రాజు మాట్లాడుతూ.. ఈ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరచడానికి పుష్కరాలేవి ఓ మంచి వేదిక అని చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని నిధులు సమీకరించి.. కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా అడుగులు వేద్దామన్నారు. గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై అనేక మంది ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఆ విగ్రహాలను నేడు ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణంలో రోజూ తిలకిస్తున్నారని చెప్పారు. అదేవిధంగా గోదావరి బండ్ పై ఉన్న విగ్రహాలను కనెక్టింగ్ బ్రిడ్జి ద్వారా పరిరక్షిస్తూ.. ఈ ప్రాంతాన్ని సుందరప్రాంతంగా తీర్చిదిద్దుతుండటం సంతోషదాయకమన్నారు.
రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో రాజమహేంద్రవరంలో నగర ప్రజలు పెనుమార్పులు చూడబోతున్నారని తెలిపారు. అందులో తొలి అడుగుగా రూ. 8 కోట్ల రిఫర్ ఫ్రంట్ అప్పర్ ప్రామినేడ్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. అలాగే దిగువన వేమగిరి నుంచి బొబ్బర్లంక వరకు కూడా గోదావరి గట్టును అభివృద్ధి పరచడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
నగర కమిషనర్ కేతన్ గర్గ్ మాట్లాడుతూ.. రాజమహేంద్రవరాన్ని టూరిజం హబ్ గా మార్చడమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా గడిచిన 10 నెలల కాలంలో నగరంలో రూ. 220 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. వీటిలో రూ. 128 కోట్లు పుష్కర పనులు కాగా పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. 2025 ఏడాదిలోనే రూ. 29 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు కమిషనర్ తెలిపారు. రూ. 8 కోట్ల నిధులతో చేపట్టిన రిఫర్ ఫ్రంట్ డెవలప్మెంట్ పనులు కూడా రానున్న 6 నెలల కాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వీటితో పాటు చిట్ట చివరి కాలనీ వరకు విద్యుత్ వెలుగులు ప్రసరించేలా రూ. కోటి నిధులతో స్ట్రీట్ లైట్లను అన్ని ప్రాంతాలలో అమరుస్తున్నట్లు తెలిపారు. అలాగే పార్కులు, రోడ్డు విస్తరణ పనులు, జంక్షన్ ల అభివృద్ధి పనులు వివిధ దశలలో ఉన్నట్లు కమిషనర్ వెల్లడించారు. తొలిదశలో 3 జంక్షన్ లలో పనులు జరుగుతుండగా.. రానున్న రోజుల్లో పూర్తిస్థాయిలో అన్ని జంక్షన్లను అభివృద్ధిపరుస్తామన్నారు. 2027 పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని నగరంలో అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నట్లు వివరించారు. మరోవైపు ట్యాక్స్ కలెక్షన్ లో రాజమండ్రి నగరం ఏపీలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని.. కనుక ప్రజల సహాయసహకారాలతోనే ఇంతటి అభివృద్ధి సాధ్యపడిందని కేతన్ గర్గ్ తెలియజేశారు.
సభాదక్ష్యులు స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ..* కల్చరర్ క్యాపిటల్ గా ఉన్న రాజమహేంద్రవరాన్ని టూరిజం హబ్ గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రివర్ ఫ్రంట్ అభివృద్ధి అనేది నగర ప్రజల 15 ఏళ్ల కల అని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో పురంధేశ్వరి గారితో కలసి ఈ ప్రాంతంలో పర్యటించిన సమయంలో రాజమహేంద్రవరాన్ని టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతామని ప్రజలకు హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు. ఆ హామీని నెరవేర్చుకుంటూ నేడు రూ. 8 కోట్ల రిఫర్ ఫ్రంట్ అప్పర్ ప్రామినేడ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అలాగే రూ. 14 కోట్ల నిధులతో లోయర్ ప్రామినేడ్ పనులను కూడా త్వరలోనే ప్రారంభించుకుంటామని చెప్పారు. ప్రస్తుతం పీవీ నరసింహరావు పార్కు, గౌతమీ నందనం పార్కులలో సుమారు 13 ప్రముఖుల విగ్రహాలు ఉన్నాయని.. వాటికి మరింత శోభ తీసుకువచ్చేలా పనులు చేపడతామన్నారు. అంతేగానీ విగ్రహాలు తొలగిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. టెంపుల్ సర్క్యూట్ లో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలను అనుసంధానించే కార్యక్రమాన్ని ఇటీవల మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారి చొరవతో ప్రారంభించుకున్నామని ఎమ్మెల్యే చెప్పారు. అలాగే ఖేలో ఇండియా కార్యక్రమం ద్వారా ఈ ప్రాంతాన్ని స్పోర్ట్స్ హబ్ గా మార్చేందుకు కూడా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు తెలిపారు. అభివృద్ధి అనేది ఎప్పుడు ఒక ప్రాంతానికి పరిమితం కాకూడదని.. వికేంద్రీకరణ జరగాలని ఎమ్మెల్యే అన్నారు. గతంలో చిన్నపాటి వర్షానికి కూడా వీరభద్ర నగర్ సహా పలు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యేవని.. కానీ ఈ ప్రభుత్వంలో చేపట్టిన కల్వర్టు పనులతో ఎక్కడా నీరు నిలిచే పరస్థితి లేదన్నారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడా ప్రజలకు అసౌకర్యం కలగకుండా పక్కా ప్రణాళికతో పనులు చేపడుతున్నామన్నారు. అలాగే నగరంలో నేటి నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులను తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగపరచుకోవలసిందిగా సూచించారు.
రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ రాజమహేంద్రవరాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో జిల్లా కలెక్టర్, నగర కమిషనర్, స్థానిక ఎమ్మెల్యే చూపుతున్న చొరవ మరువలేనిదన్నారు. వీరి త్రయంలో 2027 పుష్కరాలు అద్భుతంగా జరుగుతాయనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. గోదావరి నదీ తీరంలో కూర్చొని స్వచ్ఛమైన గాలిని పీల్చాలనేది నగర ప్రజల కోరిక అని.. దానిని సాకారం చేస్తున్న జిల్లా కలెక్టర్, నగర కమిషనర్ కు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఓవైపు గోదావరి నది., మరోవైపు కొండప్రాంతాలు, కోనసీమ అందాలు ఈ ప్రాంత టూరిజంకు ఎంతో దోహదపడే అంశాలన్నారు. కనుక రాజమహేంద్రవరం అభివృద్ధిలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ప్రజా ప్రతినిధులు చల్లా శంకర్ రావు, గన్ని కృష్ణ, అధికారులు, నగర ప్రజలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News