-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్యయకర్త మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గిరిజన హక్కుల కోసం పోరాడి, వారిలో స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు త్యాగం తెలుగు జాతికే గొప్ప గౌరవమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్యయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అల్లూరి సీతారామరాజు వర్థంతి సందర్భంగా బుడమేరు వంతెన వద్దనున్న ఆ మహనీయుని విగ్రహానికి బుధవారం పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మన్యం ప్రజల హక్కుల కోసం, దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి 27 ఏళ్ల వయసులోనే ప్రాణ త్యాగం చేసిన విప్లవ జ్యోతి అల్లూరి అని ఈ సందర్భంగా మల్లాది విష్ణు కీర్తించారు. స్వాతంత్య్ర సమరంలో అల్లూరి జరిపిన పోరాటం ఓ ప్రత్యేక అధ్యాయమని కితాబిచ్చారు. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే ప్రాణాలను అర్పించిన మహోజ్వల శక్తి అని కొనియాడారు. దేశ స్వాతంత్ర్యం కోసం జీవితాలను త్యాగం చేసిన ఆ మహనీయుని నుంచి యువత స్ఫూర్తి పొందాలన్నారు. ఆ మన్యం వీరుని ఆశయాలే ఆదర్శంగా గిరిజన సంక్షేమానికి గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విశేషంగా కృషి చేసిందని మల్లాది విష్ణు తెలిపారు. అల్లూరి పేరిట నూతన జిల్లా ఏర్పాటు ఓ చారిత్రాత్మక నిర్ణయమని వ్యాఖ్యానించారు. లంబసింగిలో అల్లూరి మ్యూజియం ఏర్పాటుకు 22 ఎకరాలను గత ప్రభుత్వం కేటాయించినట్లు పేర్కొన్నారు. అల్లూరి స్ఫూర్తితో వివక్షలకు తావులేని సమాజ నిర్మాణానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని.. అదే మనం అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు మురళీ కృష్ణంరాజు, పట్టాభి రామరాజు, చల్లా సుధాకర్, శ్యామ్, కృష్ణయ్య, దుర్గారావు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News